కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు ఎంవి.రమణ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలగోని బాలరాజు గౌడ్
కేజీకేఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – ముషీరాబాద్
కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కలిసి ఉద్యమిద్దామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి. రమణ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలగోని బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం కేజీకేఎస్ క్యాలెండర్‌ను బాలగోని బాలరాజుగౌడ్, సుప్రజ ఆస్పత్రి ఎండీ శిగ విజయ్ కుమార్‌గౌడ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాలంలో గీత కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు మంత్రులను, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. సూర్యాపేటలో వేలాది మందితో గీతన్నల రణభేరి నిర్వహించామన్నారు. వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి రెండు సంవత్సరాల నుంచి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదని, మ్యానిఫెస్టోలో మాత్రం నెల రోజుల్లోపు ఇస్తామని చెప్పారని అన్నారు. పెండింగ్ రూ.14 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్స్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. కేజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ చేసిన కాటమయ్య రక్షణ కవచం రూ.20 వేలు మాత్రమే పంపిణీ చేశారని, మిగతా వారందరికీ ఇవ్వాలని కోరారు.
నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ మూతపడిందని, నందనంలోని ప్రాజెక్టు పడావు పడిందని, వీటిని వెంటనే పున:ప్రారంభించాలన్నారు. గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన వారికి టాడి కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం నిలుపుదల చేశారని, దాన్ని వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాలోని సొసైటీలను పునరుద్ధరించాలన్నారు. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్ మాట్లాడుతూ.. కోకాపేటలోని గౌడ భవనం వూసే లేదన్నారు. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలికట్టే విజయ్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కల్లు షాపులపై ఎక్సైజ్ దాడులు మానుకోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్‌లో పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగరాజు, యాదగిరిచారి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు దుర్గయ్యగౌడ్, బైరు శేఖర్, నాయకులు కొన్నింటి ప్రభులింగంగౌడ్, మీనయ్యగౌడ్, వంగ సదానందంగౌడ్, కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉషాగొని వెంకటనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి సిరిపురం రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలుకు కలిసి ఉద్యమిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



