Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

- Advertisement -

మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అజహరుద్దీన్‌
అఫ్జల్‌గంజ్‌ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో వారోత్సవాలు


నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను వినియోగించుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారోత్సవాలను ప్రారంభించారు. తర్వాత తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ డాక్టర్‌ రియాజ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తునే తమ అభిరుచి మేరకు క్రీడా, కళారంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చారిత్రాత్మకమైన అఫ్జల్‌గంజ్‌ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం దేశంలోని ప్రధాన గ్రంథాయాల్లో 5వ స్థానంలో నిలవడం గర్వించాల్సిన విషయమన్నారు.

భవిష్యత్‌లో ఈ గ్రంథాలయంలో పాఠకుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేలా అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ రియాజ్‌ మాట్లాడుతూ.. అఫ్జల్‌గంజ్‌ గ్రంథాలయ ఆధునీకరణతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రంథాలయాల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ గ్రంథాలయంలో వివిధ భాషల్లో లక్షలాది పుస్తకాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరగ్రంథాలయ శాఖ సంచాలకులు శ్రీహరి, చీఫ్‌ లైబ్రేరియన్‌ పీజీవీ రాణి, గెజిటెడ్‌ లైబ్రేరియన్‌ సి.అపర్ణ, గ్రంథాలయ అధికారి కేసరి హనుమాన్‌తో పాటు గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -