Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి కొనుగోళ్లపై పరిమితులను ఎత్తేయండి

పత్తి కొనుగోళ్లపై పరిమితులను ఎత్తేయండి

- Advertisement -

తేమశాతం, ఏడు క్వింటాళ్ల నిబంధనలపై మరోమారు సమీక్షించండి : సీసీఐ, కేంద్ర మంత్రి, జౌళి, వ్యవసాయ శాఖ అధికారులను కోరిన రాష్ట్ర మంత్రి తుమ్మల
నేడు జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో రాష్ట్ర సర్కారు చర్చలు
కొనుగోళ్లు ఆపొద్దని రవీందర్‌రెడ్డిని కోరిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పత్తి కొనుగోళ్లపై పరిమితులను ఎత్తేయాలనీ, తేమశాతం, ఏడు క్వింటాళ్ల నిబంధనలపై మరోమారు సమీక్షించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని, కేంద్ర ఔళి, వ్యవసాయ శాఖల కార్యదర్శులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పత్తి కొనుగోళ్లపైనా, జిన్నింగ్‌ మిల్లుల సమస్యలపైనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర జౌళి, వ్యవసాయ శాఖల కార్యదర్శులు, జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సమస్యలపైనా, జిన్నింగ్‌ మిల్లుల సమస్యలపైనా విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుపాన్లు, ప్రకృతి వైఫరీత్యాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారనీ, ఉన్న పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వాలపై నమ్మకంతో కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే అక్కడ కేంద్రం నిబంధనలు పెద్ద ఆటంకంగా మారాయని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెసర్లు, కందులు, పొద్దుతిరుగుడు వంటి పంటలపై 25 శాతం పరిమితి పెట్టడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన వచ్చిన పరిస్థితిని వివరించారు. ఈ నిబంధనను ఎత్తేయాలని రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని గుర్తుచేశారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే రెండేండ్లుగా మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అకాల వర్షాలతో సోయాబీన్‌ రంగుమారిందనే నెపంతో కొనుగోళ్లు ఆపడం సరిగాదన్నారు. రంగు మారిన పంటను కూడా కొనాలని కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

కేంద్రం కోరినట్టుగా రాష్ట్రం నుండి జిల్లాల వారిగా సరాసరి పత్తి దిగుబడి గణాంకాలను కలెక్టర్ల ద్వారా తెప్పించుకొని సీసీఐకి పంపామని మంత్రి తుమ్మల తెలిపారు. మొదట్లో ఎకరానికి 11 క్వింటాళ్ల చొప్పున సేకరించి కొన్ని రోజుల తరువాత ఏడు క్వింటాళ్లకు కుదించడం దారుణమని విమర్శించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొంటామని రైతులను అయోమయానికి గురిచేయడం సబబు కాదన్నారు. తేమ శాతం పెంచి పత్తిని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను కోరినా ఇప్పటివరకు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని వాపోయారు. ఎల్‌1, ఎల్‌12 వరకు జిన్నింగ్‌ మిల్లులను విభజించి పత్తి కొనుగోళ్లు జరపాలనే నిర్ణయంపై మొదటి నుంచీ జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్ర మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులు టెండర్లకు కూడా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వ చొరవతో టెండర్లకు పిలిచామని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 243 మిల్లులు మాత్రమే రైతులకు కేటాయించడం, మిగతా 82 మిల్లులు ఇంకా తెరుచుకోకపోవడం వంటి కారణాలతో రైతులు దూరం వెళ్లి పంట ఆమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. కేంద్రం నిబంధనలు ఇటు రైతులు, అటు జిన్నింగ్‌ మిల్లులు ఆర్థికంగా నష్టపోయేలా మారాయని తెలిపారు. దీంతో జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులు సమ్మె నిర్వహించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా జిన్నింగ్‌ మిల్లర్లతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించేలా సీసీఐ అధికారులకు ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రైతులకు నష్టం కలిగించకుండా వెంటనే పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షులు రవీందర్‌రెడ్డిని కోరారు. మంగళవారం సీసీఐతో జరిగే చర్చల్లో జిన్నింగ్‌ మిల్లుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, సీఎం సూచనలతో సానుకూల నిర్ణయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు.

వారంలోగా ఆడిట్‌ పూర్తిచేయండి : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సమీక్షలో మంత్రి తుమ్మల
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆడిట్‌ను వారంలోగా పూర్తిచేయాలని సహకార శాఖ ఆడిటర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వ సహాయం లేకుండా నడిచే సహకార సంఘాల ఆడిట్‌ను జనవరిలోగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సహకారశాఖ అధికారులు, డీసీసీబీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. సంఘాల్లో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన సెక్షన్‌ 51 ఎంక్వయిరీలు, సెక్షన్‌ 52 పరిశీలనలు చట్టం ప్రకారం నిర్ణయించిన సమయంలో పూర్తి చేసి బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలనీ, దుర్వినియోగమైన మొత్తాలను తిరిగి రాబట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఇప్పటికే సర్‌చార్జి చేయబడిన కేసుల విషయంలో దుర్వినియోగమైన మొత్తాలను రాబట్టు టకు చట్టపర చర్యలు వెంటనే చేపట్టాలనీ, ఎంక్వయిరీలు, సర్‌చార్జీల విషయంలో ఏమైనా కోర్టు కేసులుంటే జీపీని సంప్రదించి కేసులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సంఘాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసి అవకత వకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారు లపై ఉందన్నారు. సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లను సమర్ధవంతంగా నిర్వహిం చాలనీ, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి సహకార సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాలపైన ఆయిల్‌ ఫాము సాగు కోసం రైతులను గుర్తించి సాగుచేసేలా ప్రోత్సహించాలనీ, ఆ బాధ్యతను సహకార అధికారులు సంఘాల సీఈఓలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌పాం పంట వేసిన తరువాత మూడేండ్ల నుంచి దిగుమతి మొదలవుతుందనీ, 35 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఖర్చులు పోగా ఎకరానికి ఏటా రూ. 15 లక్షలకుపైగా ఆదాయం లభిస్తుందన్నారు. సమావేశంలో వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ యాస్మిన్‌, మార్క్‌ఫెడ్‌ ఎమ్‌డీ శ్రీనివాస్‌రెడ్డి, టీజీసీఏబీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -