Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయంఇక విద్యార్థులకు తేలికైన స్కూల్‌ బ్యాగులు

ఇక విద్యార్థులకు తేలికైన స్కూల్‌ బ్యాగులు

- Advertisement -

బ్యాక్‌బెంచర్లు లేని తరగతి గదులకు కేరళ ప్లాన్‌
తిరువనంతపురం :
విద్యార్థులు బడికి వెళ్లాలంటే పుస్తకాల సంచి భుజంపై వేసుకుని వెళ్లాల్సిందే. దీంతో ఆ బరువులు మోయలేక వారు డీలాపడిపోయేవారు. ఈ బరువును తగ్గించేందుకు పలు రాష్ట్రాలు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కార్‌… విద్యార్థులు బరువున్న బ్యాక్‌ప్యాక్‌లతో కాకుండా బ్యాగులు తేలికగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తద్వారా పాఠశాలలకు పరుగులు తీసేలా విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా అక్కడి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతేకాక చదువులో ఆసక్తి చూపని పిల్లలు బ్యాక్‌బెంచర్లుగా మిగిలిపోకుండా ఉండేందుకు తగిన ప్రయత్నాలు చేస్తోంది. అయితే స్కూల్‌బ్యాగుల బరువును తగ్గించడం, బ్యాక్‌బెంచర్లు లేని తరగతి గదులను సృష్టించడం అనే ప్రతిపాదనను రాష్ట్ర పాఠ్య ప్రణాళిక స్టీరింగ్‌ కమిటీ ఆమోదించిందని జనరల్‌ ఎడ్యుకేషన్‌ మంత్రి వి. శివన్‌కుట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిపాదనల వెనుక లక్ష్యం విద్యార్థులు పాఠశాలలకు తీసుకెళ్లే బ్యాగుల బరువును తగ్గించడం ద్వారా వారి శారీరక, మానసిక ఆనందాన్ని నిర్ధారించడం, తరగతి గదులను ప్రజాస్వామికరణలో భాగంగా బ్యాక్‌బెంచర్లు లేని అభ్యాస వాతావరణాన్ని సృష్టించడమేనని వివరించారు.ఈ ప్రతిపాదనలను వివరంగా అధ్యయనం చేసే బాధ్యత రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)కి అప్పగించబడిందని, ముసాయిదా నివేదికను కమిటీ ఆమోదించిందని మంత్రి తెలిపారు. విద్యా ప్రక్రియలో మొత్తం సమాజం భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ముసాయిదా నివేదికపై ప్రజల వ్యాఖ్యలను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. దీని కోసం, నివేదికను ఎస్‌సీఈఆర్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలు, సూచనలను జనవరి 20 వరకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు సమర్పించవచ్చని వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో ఈ మార్పులను అమలు చేయాలని జనరల్‌ ఎడ్యుకేషన్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -