Friday, August 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువిన్నవిస్తే వినట్లే.. పోరాడాలి

విన్నవిస్తే వినట్లే.. పోరాడాలి

- Advertisement -

– 42 శాతం బీసీ రిజర్వేషన్‌పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– బీజేపీ.. సామాజిక న్యాయానికి వ్యతిరేకి
– 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా.. రాష్ట్రానికి ఉపయోగం సున్నా
– ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్టం తేవాలి
– రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి ఒత్తిడి తేవాలి
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

”కేంద్రంలోని బీజేపీ.. సామాజిక న్యాయానికి వ్యతిరేకి. అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అడ్డుపడుతోంది. కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. వినిపించుకోవడం లేదు.. వినతులతో పనులు కావు.. పోరాడాలి” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళనలకు సిద్ధమైతేనే కేంద్రం దిగొస్తుందని అన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో బీపీ రిజర్వేషన్లపై చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ తీరుతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో మనువాదం తీసుకురావాలని చూస్తోందని, మనువాదంతో కులవ్యవస్థ, అసమానతలు, దోపిడీ వ్యవస్థ పెరిగే ప్రమాదం ఉందన్నారు. లౌకికత్వాన్ని కాపాడేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రప్రభుత్వ హామీల అమలు ఏది?
రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని జాన్‌వెస్లీ అన్నారు. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని అమలుచేయాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకపోవడంతో నిరుద్యోగ జేఏసీ చేపట్టిన ఆందోళనకు సీపీఐ(ఎం) మద్దతు తెలుపుతుందని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేవని.. కానీ ప్రభుత్వం ఏడాదికి 4.5 లక్షల కుటుంబాలకే ఇండ్లు కేటాయిస్తే.. మిగతా వారికి ఎప్పటి వరకు ఇస్తారని ప్రశ్నించారు.

రెండు నెలలు బస్తీబాట
గ్రామాల్లో, బస్తీల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రెండు నెలల పాటు బస్తీ బాట నిర్వహించనున్నట్టు జాన్‌వెస్లీ తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వానికి తగిన బుద్దిచెబు తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.రమణ, వెంకట్రాములు, ప్రసాద్‌, నూర్జహాన్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐద్వా నాయకులు విజయదుర్గకు నివాళి
సీపీఐ(ఎం) నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు సతీమణి, ఐద్వా నాయకులు విజయదుర్గ.. అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతిచెందారు. బుధవారం ఆమె భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, తీగల సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్‌, ఎంవీ రమణ, ఆర్‌.వెంకట్రాములు, ఎస్‌వీ రమ, పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు తదితరులు నివాళి అర్పించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. కమ్యూనిస్టులు, అభ్యుదయవాదుల కుటుంబీకులు ఎవరైనా చనిపోతే వారి భౌతికదేహాలను వైద్య విద్యార్థుల కోసం అప్పగిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమని మెడికల్‌ కాలేజీ అనాటమీ హెడ్‌ ప్రొఫెసర్‌ డా.చంద్రశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ నాగమోహన్‌ కొనియాడారు. సమాజ హితం కోసం వారు కృషి చేస్తుంటారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -