ఆధునిక ప్రపంచంలో ‘పోస్ట్-లిటరేచర్’ (సాహిత్య-అనంతర దశ) అనే భావన బలంగా వినిపిస్తోంది. దీని ప్రకారం- ఇప్పుడు సాహిత్యం కేవలం చదివేది మాత్రమే కాదుబీ చూసేది, వినేది, అనుభవించేది. అక్షరం, దశ్యం, శబ్దం, సాంకేతికత అన్నీ కలిసిపోయిన ఒక ‘సమగ్ర కళానుభవం’గా సాహిత్యం రూపాంతరం చెందింది. ప్రస్తుతం పాఠకుడు పుస్తక పఠనం అనే ఏకాంత చర్య నుండి, మల్టీమీడియా అనే సామూహిక అనుభూతి వైపు ప్రయాణిస్తున్నాడు. గతంలో తరచుగా సాహిత్యాన్ని ఏదో దైవదత్తమైన వరమని, రచయితలను ఆకాశం నుంచి దిగివచ్చిన మేధావులని భావించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ‘సజనాత్మకత లేని రచన’ (Uncreative Writing) అనే సిద్ధాంతం ద్వారా కెన్నెత్ గోల్డ్‌స్మిత్ వంటి విమర్శకులు ‘రచన అనేది శూన్యం నుండి పుట్టదని, ఉన్న విషయాలనే పునర్నిర్మించడమని’ స్పష్టం చేశారు. ప్రముఖ విమర్శకుడు టెర్రీఈగల్టన్ ‘సాహిత్యం అనేది ఒక సామాజిక శక్తి నిర్మాణం’ అంటారు. అంటే, సాహిత్యానికి స్వతహాగా ఏదో గొప్ప సారాంశం ఉండదు.
సమాజం, పండితులు, విమర్శకులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు కలిసి దేన్నైతే ‘సాహిత్యం’ అని ముద్ర వేస్తారో, అదే సాహిత్యం అవుతుంది. ఉదాహరణకు, తెలుగులో చిత్ర కవిత్వాన్ని కవులు, పండితులు ఒకప్పుడు గొప్పగా ఆరాధించారు. కానీ ఇప్పుడు అది కరువైంది. ‘తెలుగు సాహిత్యానికి చాలా గొప్ప సంస్కృతి ఉంది. చాలా ఉన్నతమైంది’ అని మనం చెప్పుకుంటున్నాము. కానీ, సమాజంలో ఉన్న వర్గ నిచ్చెనమెట్ల వ్యవస్థలాగే, సాహిత్యంలోనూ అంతర్లీనంగా ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉంది. సమాజంలో వివిధ వర్గాల వారీగా అంతరాలు ఎలా ఉన్నాయో, సాహిత్యంలో ప్రక్రియల మధ్య అలాంటి ఆధిపత్య పోకడలు ఉన్నాయి. ఈ నిచ్చెనమెట్ల మీద కొన్ని ప్రక్రియలు దర్జాగా సింహాసనం మీద కూర్చుంటే, మరికొన్ని ప్రక్రియలు నేల మీద కూర్చుని తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. అసలు ఈ అంతరాలు ఎలా కొనసాగుతున్నాయో మన సాహిత్య ప్రక్రియలను నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది.
తెలుగు సాహిత్య చరిత్రలో సింహభాగం పద్యానిదే. ఒక దశ తరువాత సాహిత్యం కేవలం పండితుల వినోదంగా మారి, ‘పద్యం రానివాడు కవి కాదు’ అనే ఒక అలిఖిత శాసనాన్ని సృష్టించారు. సాహిత్యాన్ని ప్రజల నుంచి వేరు చేసి, పండితుల సొత్తుగా మార్చుకున్నారు. కాలక్రమంలో ఆ పద్యం సంకెళ్లు తెంచుకుని ‘వచన కవిత్వం’ వచ్చింది. ఇది మంచి పరిణామమే. కానీ, విచారకరమైన విషయం ఏంటంటే- పద్య కవులు సింహాసనం నుండి దిగిపోయారు, ఆ స్థానాన్ని వచన కవులు ఆక్రమించారు. ఆధిపత్యం రూపం మార్చుకుంది. అంతే. ఈ ప్రక్రియల అంతరాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒక సమాజాన్ని, ఒక కాలపు చరిత్రను, వ్యక్తుల మనస్తత్వాలను సమగ్రంగా చిత్రించే శక్తి ‘జీవిత చరిత్రలు, ఆత్మచరిత్రలు, యాత్రాచరిత్రల’కు ఉంది. ఒక రచయిత వందల పుటల ఆత్మచరిత్ర రాయడానికి ఎంతో పరిశోధన, ఓపిక, వాస్తవికత అవసరం. కానీ, మన సాహిత్య వ్యవస్థలో ఈ బృహత్తర రచనలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు.
కేవలం పది పంక్తుల కవిత రాసిన కవికి వేదికల మీద దొరికే ప్రాధాన్యత, ఒక సమాజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన వచన రచయితకు దొరకడం లేదు. ఇక్కడ విషయం రచన పరిమాణం కాదుబీ ఆ రచనలో ఉన్న ‘జీవిత చిత్రణ’. భావోద్వేగపు ఒక చిన్న తునకను పట్టుకునే కవితకు ఉన్న ‘గ్లామర్’, ఒక జీవితాన్ని మొత్తం ఆవిష్కరించే వచన ప్రక్రియకు లేకపోవడం హేతుబద్ధం కాదు.
అలాగే యండమూరి, మల్లాది వంటి రచయితలు వేలాది మందికి పుస్తకాలు చదివే అలవాటు చేశారు. అయితే, వీరు రాసినవి వాణిజ్య నవలలని, విమర్శకులు వారిని ‘సీరియస్ సాహిత్యకారులు’గా గుర్తించడానికి నిరాకరించారు. ఈ వాదనలో కొంత నిజం ఉండవచ్చు. కానీ, ఒక మౌలికమైన తర్కాన్ని మనం విస్మరించకూడదు. పాఠకుడు అంటూ లేకపోతే సాహిత్యానికి ఉనికే లేదు. చదవడం అనే అలవాటును నేర్పిన పత్రికలను ‘వాణిజ్య పత్రికల చెత్త’ అనిఈసడించుకోవడం సమంజసం కాదు. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థను ఇన్నాళ్లు కాపాడింది ఎవరు? నిస్సందేహంగా ‘విమర్శకులే’. సాహిత్యం అనే కోటకు వీరు ద్వారపాలకులుగా మారారు. కొంతమంది విమర్శకులు తమకు నచ్చిన ప్రక్రియను, తమ వర్గానికి చెందిన వారిని ఆకాశానికి ఎత్తడానికి విమర్శను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు.
తెలుగు సాహిత్యం చేసిన మరో చర్చనీయాంశం- ‘సినిమా సాహిత్యం’ను తక్కువగా చూడటం. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలను భక్తితో కొలిచే పండితులు, సినిమా పాటను మాత్రం ‘వ్యాపారం’ అనికొట్టిపారేస్తారు. నిజమే, ఎక్కువ మందికి చేరినంత మాత్రాన అది గొప్ప సాహిత్యం కాకపోవచ్చు. సంఖ్యను బట్టి విలువను నిర్ణయించలేం. కానీ ‘ప్రభావం’ విషయంలో మాత్రం సినిమా పాట పాత్రను తక్కువ చేయలేం. నిరాశలో ఉన్నవాడికి ధైర్యం చెప్పడంలో, ప్రేమను పంచడంలో కవిత్వం కంటే సినిమా పాట త్వరగా చేరువయ్యింది. ‘స్వయం ప్రకటిత మహాకవుల’ కవితల కంటే, ‘ఆకలిరాజ్యం’లో ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్’, ‘మాతృదేవోభవ’లో ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకు…’.. ఇంకా ఇలా ఎన్నో పాటలు సామాన్యుడిని కదిలించాయి. లక్షలాది మంది గుండెలకు హత్తుకునే పాట కూడా గొప్ప సాహిత్యమే. అందరి కంటే అట్టడుగున, నేల మీద పడి ఉన్నది ‘జానపద సాహిత్యం’. ఇది మట్టిలో పుట్టిన, చెమటలోతడిసిన అక్షరం. కానీ దీనికి రాత లేదనే సాకుతో, సాహిత్య చరిత్రలో చోటు లేకుండా పోయింది.
జానపద సాహిత్యం అనేది కేవలం పాటలకే పరిమితం కాదు. అందులో భాగమైన సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు అత్యంత శక్తివంతమైన సాహిత్య రూపాలు. సాహిత్యం ప్రధాన లక్షణం ‘అల్పాక్షరాల్లోఅనంతార్థం’ చెప్పడం. ఆ లెక్కన చూస్తే, వేమన పద్యాలకంటే, శ్రీశ్రీ కవితలకంటే ముందే సామెతలు ఈ లక్షణాన్ని సంతరించుకున్నాయి. విశ్వవిద్యాలయాల్లో దీనిపై పరిశోధనలు జరుగుతాయి తప్ప, ప్రధాన స్రవంతిలో ఇప్పటికీ దీనికి సరైన గౌరవం దక్కలేదు. నేడు సాంకేతికత సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. సాహిత్యం కేవలం చదివేది మాత్రమే కాదు, చూసేది కూడా అని మన పూర్వీకులే చెప్పారు. నాటకాన్ని దృశ్య కావ్యంగా వారు గౌరవించారు. నేడు ఆ నాటకానికి ఆధునిక రూపాలే సినిమా, టీవీ, యూట్యూబ్. విమర్శకులు చెప్పినట్లు ‘సత్య జీవిత మార్గాన్ని బోధించేదే సరైన కళ’. నేడు కొన్ని టీవీ షోలు, చర్చా కార్యక్రమాలు సమాజంలోని మూఢనమ్మకాలను ఎండగట్టడంలో వందల పుస్తకాలు చేయలేని పనిని సులువుగా చేస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ వచ్చాక, కనుమరుగైపోతున్న పల్లె పాటలు, జానపద గేయాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి.
ఒకప్పుడు ‘రేలారే రేలా’ వంటి కార్యక్రమాలు నాటిన విత్తనాలు, నేడు డిజిటల్ ప్రపంచంలో మహావృక్షాలయ్యాయి. మంగ్లీ, కనకవ్వ, గంగవ్వ వంటి వారి గొంతుకలు ఈ తరానికి జానపదాన్ని కొత్తగా పరిచయం చేశాయి. ఇది సాంకేతికత ఇచ్చిన వరం. ఉదాహరణకు ఆదేశ్ రవి పాడిన ‘పిల్ల జెల్లా ఇంటికాడఎట్లఉన్రో…’, మిట్టపల్లి సురేందర్ ‘కలిగినోళ్ళకలికిమేడ…’ ఇలా ఉత్తమ సాహిత్య విలువలు ఉన్న పాటలు యూట్యూబ్ పుణ్యమా అని లక్షలాది మందికి చేరువయ్యాయి. అలాగే, రోడ్ల దుస్థితిని చంద్రయాన్ ప్రయోగంతో పోల్చుతూ, ‘చంద్రుడి మీదకు వెళ్ళడం కన్నా… మా ఊరి గుంతల రోడ్డు మీద ఆఫీసుకి వెళ్ళడమే పెద్ద సాహసం’ అని చెప్పడం ద్వారా వ్యవస్థలోని లోపాలను ఘాటుగా ప్రశ్నిస్తాయి. ఈ ఉదాహరణని గమనిస్తే, ఇవి కేవలం నవ్వించి వదిలేసేవి కావని స్పష్టమవుతుంది. పాతకాలంలో ‘చాటువు’లు సమాజంలోని లోపాలను ఎలా ఎత్తిచూపాయో, నేడు ఈ మీమ్స్, కార్టూన్లు అదే పనిని ఆధునిక సాంకేతికతతో చేస్తున్నాయి.
కవితలు, సంపాదకీయాలు చేయలేని పనిని ఒక్క నిమిషంలో చేస్తున్నాయి. ఇవి శాశ్వత సాహిత్యం కాకపోవచ్చు, కానీ సమకాలీన సమాజానికి అద్దం పట్టే ‘సామాజిక విమర్శనా అస్త్రాలు’ అనడంలో సందేహం లేదు. పెద్ద విషయాన్ని చిన్న క్యాప్షన్‌తో, ఒకే ఒక్క ఫోటోతో ఆలోచింపజేసేలా చెప్పే ఈ ప్రక్రియలను నిస్సందేహంగా ఆధునిక ‘డిజిటల్ మినీ కావ్యాలు’గా పిలవచ్చు. ఈ విశ్లేషణల సారాంశం ఒక్కటే. మనం సాహిత్యాన్ని కొత్తగా నిర్వచించుకోవాలి. మాధ్యమం ముఖ్యం కాదు. అది తాళపత్రమా, కాగితమా, మొబైల్ ఫోనా.. అన్నది అనవసరం. అందులో ఉన్న ‘కంటెంట్’ ముఖ్యం. అలాగే అర్థం కావడమే పరమావధి. పాండిత్యం కంటే సంభాషణ ముఖ్యం. సామాన్యుడి గుండెను తాకనిది ఏదీ ఉత్తమ సాహిత్యం కాలేదు. ఏది మనిషిని ఆలోచింపజేస్తుందో, ఏది సమాజంలో చలనం తెస్తుందో అదే నిజమైన సాహిత్యం. సాహిత్యం అనేది కొంతమంది మేధావుల, పండితుల సొత్తు కాదు, అది ప్రజల ఆస్తి. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థ కూలిపోవాలి. కవిత్వం, కథ, నవల, పాట, మీమ్… ఏ రూపమైనా సరే, ‘సమాజంలో ఉత్తమ మార్పులు కోరుకునే అర్థవంతమైన అభివ్యక్తే సాహిత్యం’. ఈ దిశగా మన సాహిత్య దృక్పథం విస్తృతం కావలసిన అవసరం ఉంది.
ప్రొ|| గంపా వెంకటరామయ్య, 9958607789



