గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే ప్రతి విద్యార్థికి సహజంగా తెలుగు భాష పట్ల అభిమానం, ప్రేమ ఉంటాయి. అలాగే నాకు కూడా గర్భాం ఉన్నత పాఠశాలలో చదివినప్పుడు తెలుగు భాష ఇష్టమైన సబ్జెక్టుగా ఉండేది. ఇంటర్మీడియట్ చదివిన రోజుల్లో నన్ను మొదటిసారి సాహిత్యం వైపు నడిపించిన సార్ డాక్టర్ జక్కు రామకృష్ణగారు. ఆయన నన్ను ”అమృతం కురిసిన రాత్రి” అనే కవితా సంపుటిని చదవమని ప్రోత్సహించారు. నేను ఆ పుస్తకాన్ని కొని చదివి చాలా ఆనందించాను, కవిత్వం అంటే ఎలా ఉంటుందో మొదటిసారిగా తెలుసుకోగలిగాను. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు తన కవిత్వం గురించి చెబుతూ ”నా కవిత్వం వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, నా కవిత్వం కన్నీటిజడులలో తడిసే దయాపారావతాలు” అనే వాక్యాలు నాకు ఎంతగానో నచ్చాయి. ఈ పుస్తకం చదవకముందు తెలుగు అంటే కేవలం పద్యాలే అనుకునేవాడిని.
కానీ ఈ పుస్తకం చదివాక నా ఆలోచన, దృక్పథం మారాయి. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ కొండపల్లి సుదర్శన్ రాజుగారు సాహిత్యం గురించి బాగా వివరించేవారు. సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలను మరింత లోతుగా బోధించేవారు. ఆయన బోధనల ఫలితంగా నేను ఏదైనా పుస్తకం చదివేటప్పుడు దానిలోని సారాంశాన్ని గ్రహించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి అన్వేషించడం మొదలుపెట్టాను. నేను ప్రధానంగా ఆనంద జీవిని. నా వరకు ఆనందం అంతా కూడా సాహిత్యంతో ముడిపడి ఉంది. ప్రతిరోజు ఒక కథ గాని కవిత గాని వ్యాసం గాని తప్పకుండా చదువుతాను. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడిని కాబట్టి ఆ సాహిత్య తృష్ణ ఇంకా పెరుగుతూనే ఉంది. సాహిత్యం ఆలోచనామృతం. సాహిత్యంలో ఉండే ఆనందం అనుభవించి ఆస్వాదించాలి తప్ప వివరించడానికి వీలు లేదు.
- మరడాన సత్యారావు, 7989398647



