పొరపాటున శరీరానికి చిన్న గాయం అయితేనే ప్రాణం విలవిలలాడిపోతుంది. ఏ జబ్బో వచ్చి కొన్నాళ్లు మంచం మీద గడపాల్సి వస్తే నాకే ఎందుకిలా అని వాపోతాం. అలాంటిది ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియదు. నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసేసుకుంటాం. అయినవారందరినీ వదిలి హఠాత్తుగా వెళ్లిపోడానికి ఎలా మనసు వస్తుందో కొందరికి? అసలు బాధల్లేని మనిషి ఎవరైనా ఈ భూమ్మీద ఉంటారా? ప్రతి మనిషికీ బాధలు ఉంటాయి. ఎవరి స్థాయిలో వారికి కష్టాలు, సమస్యలు ఉంటాయి. అన్నింటినీ తట్టుకొని నిలబడటమే కదా జీవితం. చావాలనుకుంటే కన్పించేది ఒక్కటే కారణం. కానీ బతకడానికి వెయ్యి కారణాలుంటాయి. ఈ విషయం ఎందుకు ఆ క్షణంలో గుర్తుకు రాదు. అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపిస్తున్న పరిస్థితులేమిటి… అందులో సమాజం బాధ్యత ఎంత అని ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రశ్నించుకోవల్సిన అంశాలు.
ఎక్కువగా యువత, మహిళలే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు కొన్ని గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. దాదాపు మూడోవంతు ఆత్మహత్యలు 18-45 ఏండ్ల వారే ఎక్కువ ఉన్నారని ఇటీవలి కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిళ్లూ, ఆర్థిక మమస్యలు, ప్రేమవైఫల్యాలూ యువతరాన్ని ఆత్మహత్యలవైపు మళ్లిస్తున్నాయి. మహిళల ఆత్మహత్యల్లో నలభై శాతం ఒక్క మన దేశంలోనే జరుగుతున్నాయంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాదాపు అరగంటకో అతివ ప్రాణం బలవంతంగా కడతేరుతోంది. అందుకు బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు, గృహహింసా, వరకట్నం, అత్తింటి వేధింపులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ వంటి కారణాలెన్నో. అయితే క్షణికావేశంతో నిర్ణయం తీసుకోవడం మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. తమ తర్వాత బిడ్డలు అనాథలుగా మిగలకూడదని పిల్లల్ని చంపి తాము చనిపోతున్న సంఘటనలూ మహిళల్లోనే ఎక్కువగా చూస్తున్నాం.
మహిళల ఆత్మహత్యల ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆత్మహత్యల్ని నివారించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. అలా చేయాలంటే ఆ ఆలోచన ఉన్నవారి ప్రవర్తనలో కన్పించే సంకేతాలను గుర్తించాలి. ఇలాంటి ఆలోచనలు ఒకసారి వస్తే వాటంతటవి పోవు. తప్పనిసరిగా కుటుంబ సభ్యుల, మానసిక నిపుణుల సహాయం కావాలి. మాటల్లో తరచూ చావు ప్రస్తావన తెస్తుంటే ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. వారి మనసులో ఏదో ఆలోచన ఉంటేనే అలా మాట్లాడతారు. వారి కష్టమేమిటో తెలుసుకుని ధైర్యం చెప్పాలి. ఒంటరిగా వుండేందుకు ఇష్టపడుతున్నా, చీకటీ మాటికీ చిరాకు పడుతున్నా, దినచర్యలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నా, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా, తనకిష్టమైన వస్తువుల్ని ఎవరికైనా ఇచ్చేస్తున్నా, ఏదో తేడా ఉందని గుర్తించాలి. వారిని ఒంటరిగా వదలకూడదు. నెమ్మదిగా నచ్చజెబుతూ సమస్య నుంచి బయటపడేలా చూసుకోవాలి.
చాలా వరకు ఆత్మహత్య సంఘటనలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల్లా కనిపిస్తాయి. కానీ నిజానికి సగానికి పైగా ఘటనల్లో ఆ ఆలోచన చాలా కాలం నుంచి వారి మనసులో మెదులుతూ ఉంటుంది. దాని గురించి ఏదో ఒక రూపంలో సంకేతాలు ఇస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో, ప్రాణం ఎంత విలువైనదో, ఆప్తులు ఎంతగా దు:ఖిస్తారో పెద్దలు చెప్పాలి. ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడే మార్గాలుంటాయనీ బతికి సాధించాలనీ ధైర్యం చెప్పాలి. చివరగా ఒక విషయం మనసుకు బాధ కలిగినప్పుడు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే భారం తగ్గుతుంది. మనసు మళ్లుతుంది. కానీ మనసు విప్పి చెప్పిన ఆ రహస్యాన్ని కడుపులో దాచుకుంటారన్న నమ్మకం ఎవరిమీదా లేకపోతే హెల్ప్‌లైన్లు ఆ భరోసానిస్తాయి.
జీవితాన్ని జీవించండి
- Advertisement -
- Advertisement -