- Advertisement -
లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.100 కోట్లు ఖర్చు
- అయినా మెరుగుపడని విద్యుత్ పంపిణీ వ్యవస్థ
- తరచూ తెగిపడుతున్న వైర్లు.. ప్రమాదాల బారిన సిటీజన్లు
- బాధ్యులపై చర్యలు శూన్యం
- వరుస ప్రమాదాలతో డిస్కం హడావుడి.. తర్వాత షరా మామూలే..
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యుత్ లైన్లు నగరవాసుల జీవితాల్లో చీకట్లను మిగుల్చుతున్నాయి. నెత్తిన మృత్యుపాశాల్లా వేలాడుతున్న వైర్లు ఎప్పుడు.. ఎవరిపై తెగిపడతాయో తెలియని విధంగా పరిస్థితి ఉంది. విద్యుత్ లైన్ల నిర్వహణకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏటా రూ.వంద కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా.. ప్రమాదాలు తగ్గకపోగా మరింత పెరుగుతుండటం గమనార్హం. ఘటన జరిగినప్పుడు డిస్కం హడావుడి చేసి తర్వాత చేతులు దులుపుకుంటోంది తప్పితే తగిన పాఠాలు నేర్వడం లేదు. నివారణకు దిద్దుబాటు చర్యలూ చేపట్టడం లేదు. తాజాగా మంగళవారం నాచారంలో రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభం విరిగి మీద పడటంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు.
విద్యుత్ తీగలు.. ప్రాణ సంకటం
హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ తీగలు ప్రాణ సంకటంగా మారాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగడం, తక్కువ ఎత్తులో ఉన్న తీగలు, నిర్వహణ నిర్లక్ష్యం, జంక్షన్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో అమాయకులు ప్రాణం కోల్పోతున్నారు. గతంలో ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు ఉండగా.. ఈ ఏడాది రెండు, మూడు భయంకర ఘటనలు జరిగాయి. సాగర్ రింగ్ రోడ్డుకు వెళ్లే దారిలో చింతలకుంట సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మరువక ముందే రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. రెండ్రోజుల కిందట నాచారంలో బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై విద్యుత్ స్తంభం విరిగి పడటంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. కొందరు విద్యుత్ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుంగిపోతున్న స్తంభాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 498 ఉండగా, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 1,022 ఉన్నాయి. 33 కేవీ యూజీ కేబుల్ లైన్లు 1,280 కిలోమీటర్లు విస్తరించి ఉండగా, 33 కేవీ ఓవర్ హెడ్ లైన్లు 3,725 కిలోమీ టర్లు, 11 కేవీ ఓవర్ హెడ్ లైన్లు 21,643 కిలోమీటర్లు, 11కేవీ యూజీ కేబుల్ లైన్లు 957 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 1,50,992 ఉండగా, వీటి పరిధిలో 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 11 కేవీ విద్యుత్ స్తంభం ఎత్తు 9 మీటర్లపైగా ఉండగా అదే 33 కేవీ స్తంభం 10 మీటర్లకుపైగా ఎత్తు ఉంటుంది. మెజార్టీ సర్వీసు ప్రొవైడర్లు ఐదారు మీటర్ల ఎత్తు నుంచే వైర్లను రోడ్డుకు అటు ఇటుగా ఉన్న ఇండ్లకు లాగుతున్నారు. లైన్ వేయగా మిగిలిన వైర్లను ఉండలుగా చుట్టి స్తంభాలకు వేలాడదీస్తున్నారు. ఇలా ఒక్కో స్తంభానికి కేజీల బరువు ఉన్న తీగలు వేలాడుతున్నాయి. సామర్థ్యానికి మించిన బరువును తట్టుకోలేక ఆయా స్తంభాలు ఏదో ఒక వైపు వంగిపోతున్నాయి.
ఏటా రూ.100 కోట్లు ఖర్చు..
నగరంలోని పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్ హెడ్ చైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజు వైర్లు సరిచేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను మార్చడం, బీఆర్ వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కం ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయితే, నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి తప్ప సరఫరా వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడటం లేదు. మరణాలు ఆగడం లేదు. మెట్రో జోన్ పరిధి పలు బస్తీల్లోని ఇరుకు గల్లీల్లో ప్రమాదకరంగా మారిన కండక్లర్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 550 కిలో మీటర్లు గుర్తించి ఆగస్టు నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభించలేదు.
కొన్ని ఉదంతాలు ఇలా..
- కేపీహెచ్‌బీ కాలనీలో షటిల్ ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ షాక్‌కు గురై ప్రాణం కోల్పోయాడు.
- సనత్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మరణించారు.
- ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహీన్‌నగర్‌లో 18 ఏండ్ల బాలిక విద్యుత్ షాక్‌తో చనిపోయింది.
- మే నెలలో ఎంఎస్ మక్తా గ్రౌండ్‌లో ఆటాడుకుంటూ విద్యుత్ స్తంభాన్ని తాకి 12 ఏండ్ల చిన్నారి మృతిచెందింది.
- కాటేదాన్ మధుబన్ సమీపంలో 5 నెలల కిందట నియంత్రిక తీగ తెగి డీసీఎంపై పడటంతో డ్రైవర్ మృతిచెందారు. రెండు ఆవులు, మూడు మేకలు మృత్యువాత పడ్డాయి.
- మూడేండ్ల కిందట పద్మారావునగర్‌లో కవర్ కండక్టర్ తెగిపడటంతో ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తి ప్రాణం కోల్పోయాడు.
- దుండిగల్ మున్సిపాల్టీలో రెండేండ్ల కిందట మల్లంపేట ఆకాశ్ లేవుట్ సమీపంలో కరెంట్ తీగ తెగి రోడ్డుపై పడగా ఆ సమయంలో బైక్‌పై వెళుతున్న స్థానిక నివాసికి కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు.
- నాలుగేండ్ల కిందట జవహర్‌నగర్ అంబేద్కర్‌నగర్ నోబెల్ పాఠశాల వద్ద ఇంటిపై రేకులు వేస్తుండగా ఎల్ లైను తీగలు తగిలి ఓ వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు.
- మల్కారం ప్రాంతంలో ఎనిమిదేండ్ల బాలుడు విద్యుత్ జంక్షన్ వద్ద తీగలు తగిలి విద్యుద్ఘాతంతో మృతిచెందాడు. ఇలా వెలుగు జూసినవి అధికారికంగానే ఇన్ని ఉంటే.. అనధికారికంగా మరెన్ని ప్రమాదాలు జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
- Advertisement -