– బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకొని తీరుతాం
– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు… రేవంత్ జుట్టు బిజెపి చేతిలో
– తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బనక చర్ల ప్రాజెక్ట్ ఎలాగైనా కట్టి తీరుతాం అంటున్న లోకేష్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటిమట్టుకు స్పందించకపోవడంతో అసలు లోగుట్టు బయట పడిందని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బనక చర్ల ప్రాజెక్ట్ ను బీజేపీ కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం ముందుకు తీసుకుపోతున్నట్టుగా లోకేష్ వాక్యలతో అర్థం అవుతున్నదన్నారు.బీజేపీ కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు కలిసి చేసే ఈ నాటకంలో రేవంత్ రెడ్డిని పావులాగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
బనక చర్ల ప్రాజెక్ట్ పై చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలు.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ, తెలంగాణ బిజెపి నాయకుల చేతకాని తనానికి నిదర్శనం అన్నారు.
బనక చర్ల మీద చర్చ కోసం ఢిల్లీ కి పోను అని పగలు చెప్పి, రాత్రికి రాత్రి మనసు మార్చుకొని ఢిల్లీకి వెళ్లి బనక చర్ల మీద వేసిన కమిటీని ఒప్పుకొవడంలో ఆంతర్యం ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.బనకచర్ల ఎజెండాలో లేదు.. కడుతం అంటే కదా అడ్డు చెప్పేది అని మాట్లాడిన రేవంత్ రెడ్డి… మంత్రి లోకేష్ మాట్లాడిన మాటలపై నీ నోరు ఎందుకు పెగలటం లేదన్నారు. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు మెప్పుకోసం, కేంద్రం దగ్గర తన స్వప్రయోజనాల కోసం తెలంగాణను తాకట్టు పెడుతున్నాడని విమర్శించారు.మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు నోటుకు ఓటు కేసులో నిందితుడు అయిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు,బిజెపి చేతిలో ఉన్నదన్నారు.అందుకే తనను తాను కాపాడుకోవడానికి బనకచర్ల విషయంలో చంద్రబాబు, బీజేపీ లకు వత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ కు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు.
బిజెపి నుండి 8 మంది ఎంపిలను గెలిపించినా, తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఒక్కరు కూడా మాట్లాడటం లేదని,పదవుల కోసం పెదవులు ముసుకున్నారని విమర్శించారు.ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేసే బనక చర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ పోరాడేది కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని,ఏనాటికైనా తెలంగాణ కు కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు.బనక చర్ల ప్రాజక్ట్ విషయంలో బీజేపీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.