ముంబయి : బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 60 కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి సంబంధించిన చీటింగ్ కేసులో ముంబయి పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం వారిపై శుక్రవారంనాడు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. శిల్పాశెట్టి దంపతులు తరచూ అంతర్జాతీయ పర్యటనలు చేపడుతున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. రూ.60 కోట్ల రుణం, పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక ఒప్పందం చేసుకున్న ఒక వ్యాపారవేత్తను శిల్పా దంపతులు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. దీనిపై ఆగస్టు 14న జుహూ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని వివరించారు. నిందితులు దేశం విడిచివెళ్లకుండా వారిపై నిఘా ఉంచడం కోసం లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. ఫలితంగా ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణ పాయింట్ల వద్ద అధికారులు నిందితులను అదుపులోకి తీసుకునే వీలుంటుంది.
ఇదీ కేసు..
ముంబయి చెందిన దీపక్ కొఠారీ అనే వ్యాపారవేత్త నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015లో రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా శెట్టి- కుంద్రాతో తనకు పరిచయం ఏర్పడిందని దీపక్ ఫిర్యాదులో వివరించారు. అప్పడు వీరు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అయిన ‘బెస్ట్ డీల్ టీవీ’కి డైరెక్టర్లుగా ఉన్నారనీ, అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా ఉందని పేర్కొన్నారు. అయితే 2015-2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ కోసం దీపక్ వీరికి రూ. 60.48 కోట్లు ఇవ్వగా, ఆ నిధులను శెట్టి తన వ్యక్తిగతంగా ఖర్చు చేశారని వాపోయారు.
శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు
- Advertisement -
- Advertisement -