నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి, పెద్దపెల్లి జిల్లాల సరిహద్దుల్లోని మండల కేంద్రమైన తాడిచర్ల ఇసుక క్వారీ-2 వద్ద లారీ డ్రైవర్లు నిత్యం ఆందోళన చేస్తున్నారు. తాము సీరియల్‌లో క్యూలో నిలిచిన లారీలను పక్కన పెట్టి, పట్టణాల నుంచి అక్రమంగా వస్తున్న కంపెనీ లారీలకు మాత్రమే లోడ్ ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇళ్ళకు వెళ్లకుండా లారీలలోనే జీవిస్తున్నామని, ప్రభుత్వానికి డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ఇచ్చి సీరియల్ ప్రకారం లారీలను పెట్టుకున్నప్పటికీ, క్వారీ యాజమాన్యం అక్రమంగా తమను పట్టించుకోకుండా డబ్బులు తీసుకున్న వారికి మాత్రమే లోడ్ ఇస్తున్నారని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా…
ఇసుక క్వారీ యాజమాన్యం ఒక్కో లారీకి రూ.3,000 నుంచి రూ.4,000 తీసుకుని లోడ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీకి రూ.3,000 నుంచి రూ.4,000 ఇవ్వకపోతే ఇసుక లోడ్ చేయడంలేదని, దీంతో రోజుకు దాదాపు 100 లారీలు లోడ్ అవుతుండటంతో లక్షల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇసుక కొనుగోలు కోసం ఎలాంటి అదనపు డబ్బులు ఇవ్వకూడదని చెప్పినప్పటికీ, ఇక్కడ క్వారీ యాజమాన్యం మాత్రం డబ్బులు ఇస్తేనే లోడ్ ఇస్తుందన్నది వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సమయ పాలన లేకుండా ఇష్టారాజ్యంగా రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి 9 తరువాత సైతం కంపెనీ లారీల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న క్వారీ యాజమాన్యం పై టీఎస్‌ఎండిసి, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్న నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కొద్దీ లారీలు రోడ్డుపై నిలిపి ఉంచడం వల్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని లారీ డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు.