– ఇండెంట్ పెట్టడంలో కేంద్రం కుట్ర
– విదేశీ కంపెనీలకు గతేడాది 71.74 లక్షల టన్నులకు ఇండెంట్
– ఈ యేడాది 60.62 లక్షల టన్నులకే పరిమితం
– దేశీయంగా ఉత్పత్తి 9 శాతానికి తగ్గింపు
– కొరతకు ఇదే ప్రధాన కారణం
– ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం
గుడిగ రఘు
కేంద్ర ప్రభుత్వం యూరియాపై దాగుడుమూతలా డుతున్నది. సరిపడినంత ఇస్తున్నామంటూనే రైతులకు అందకుండా కుట్రలు చేస్తున్నది. రైతుల పట్ల పైకి ప్రేమ కురిపిస్తూనే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. నానో యూరియా (లిక్విడ్) వినియోగాన్ని పెంచాలనే మోజుతో కేంద్రం సాధారణ యూరియాను ద్వేషిస్తున్నది. అంతేకాకుండా కేంద్ర బడ్టెట్‌లో ఎరువుల సబ్సిడీని క్రమంగా తగ్గిస్తున్నది. దీంతో రైతులు తమకు కావాల్సిన ఎరువులను మార్కెట్‌లోనే కొనేలా పురిగొల్పుతున్నది. పైకి మాత్రం రైతులు యూరియాను అధికంగా వినియోగిస్తూ నేల స్వభావాన్ని దెబ్బతిస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నది. ఎకరాకు ఎంత మొతాదులో వాడాలి అనే ప్రణాళిక కూడా లేదు. కానీ రైతులు యూరియా ఎక్కువగా వినియోగిస్తున్నారంటూ వారిని బదనాం చేస్తూ…నానో యూరియాను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది. తద్వారా కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తున్నది. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన లేకపోయినా, వారిని బలవంతం చేస్తున్నది. నానో యూరియాను ఉపయోగించడం వల్ల పంటలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది.
ఉత్పత్తి పెరుగుతుందా? లేదా? అనే విషయమై కేంద్రానికి స్పష్టత లేదు. కానీ యూరియా వాడకాన్ని తగ్గించేందుకు చాపకింద నీరులా సరఫరానే ఆపేస్తున్నది. ప్రతియేటా సీజన్‌కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ఇండెంట్ పెడుతుంది. కానీ ఈసారి ఏకంగా ఆ ఇండెంట్‌నే తగ్గించి పరోక్షంగా రైతులను నిస్సాహాయులను చేసింది. ముఖ్యంగా చైనా, ఒమెన్, రష్యా, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల నుంచి కేంద్రం యూరియాను దిగుమతి చేసుకుంటుంది. ఈ చర్యలతో రాష్ట్రంతోపాటు దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదముంది. ఈ దేశాల నుంచి 2023-24లో 71.74 లక్షల టన్నుల యూరియాకు ఇండెంట్ పెట్టింది. 2024-25లో 60.62 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా యూరియా ఉత్పత్తి ఉన్నా…ప్లాన్ ప్రకారమే కేంద్రం ఇండెంట్‌ను తగ్గిస్తూ వస్తున్నది. దాదాపు 11.12 లక్షల మెట్రిక్ టన్నులను ఆపేసింది. చివరకు దేశీయ ఉత్పత్తిని కూడా 9శాతానికి తగ్గించడంతో దేశంలో యూరియా కొరత రైతులను వెంటాడుతున్నది. దేశంలో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం యూరియా కొరతను సృష్టించింది. ఫలితంగా దేశానికి కావాల్సిన సరఫరా ఆగిపోవడంతోపాటు తెలంగాణకు కోత పెట్టింది. అందులో మన రాష్ట్రానికి 9.92లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయింపులు చేసింది.
అందులో ఇప్పటివరకు 6.05 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, చత్తీస్‌గడ్, రాజస్థాన్,మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేశంలో యూరియా కొరత రైతులను వేధిస్తున్నది. కేంద్రం చేసిన తప్పిందాలనుకప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని రాష్ట్రాలపై నెడుతున్నది. కానీ మన రాష్ట్రానికి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన యూరియాలో కోత పెట్టింది. కేంద్రం నుంచి సరఫరా అయిన యూరియాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా రైతులకు పంపిణీ చేయలేదు. సకాలంలో రైతులకు యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐదుసార్లు లేఖలు రాశారు. కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అయినా కేంద్రం కనికరించలేదు. యూరియా సంక్షోభానికి కేంద్రమే కారణమంటూ రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పరిస్థితులను ముందుగానే అందులో పేర్కొన్నారు. యూరియా ఆలస్యం కావడంతో చాలా చోట్ల రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ఉంటున్నారు. కొన్ని చోట్ల డీలర్లు కూడా కృత్రిమ కొరతను సృష్టిస్తూ…అధిక ధరలకు అమ్ముకని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రైతులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నది.
ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తగ్గించింది
టి సాగర్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యూరియా సరఫరాను తగ్గించింది. రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నది. నానో యూరియాపై కేంద్రానికి స్పష్టత లేకపోయినా ప్రోత్సహిస్తున్నది. నానో పేరిట యూరియాను దేశీయ ఉత్పత్తిని సైతం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఏయే రాష్ట్రానికి ఏ సమయంలో ఎంత యూరియా కావాలనే ప్రణాళిక కేంద్రం వద్ద లేదు. అలాగే ఎరువుల సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నది. ఫలితంగా రైతులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. యూరియా తగ్గించడం వల్ల దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. కేంద్రం ఇదే రకంగా ఆలోచిస్తే శ్రీలంక తరహాలో దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
కేంద్రమే కారణం సుంకేట అన్వేష్‌రెడ్డి
చైర్మెన్, విత్తనాభివృద్ధి కార్పొరేషన్
దేశంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం. ప్రతిసీజన్‌కు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలి. ఎంత అవసరమో అంత రాష్ట్రాలకు యూరియా పంపించాలి. ఈసారి సగానికి సగం యూరియా గండికొడుతుంది. యూరియా కొరత తీవ్రమైంది. బఫర్ స్టాక్ లేకుండా పోయింది. అంతర్జాతీయంగా దిగుమతి తగ్గించడం వల్ల రైతులకు యూరియా సరిపడినంత అందడం లేదు. దేశీయ యూరియా ఉత్పత్తిని కూడా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అన్ని రాష్ట్రాల్లోను యూరియా కొరత ఏర్పడింది.
