రష్మీ శుక్లా పదవీ విరమణ
ముంబయి : మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రికార్డులోకెక్కిన రష్మీ శుక్లా శనివారం రిటైరయ్యారు. దాదాపు 37 ఏండ్లు భారత పోలీసు సర్వీసులో ఆమె సేవలందించారు. ఆమె 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీనియర్ అధికారుల సమక్షంలో భోయివాడలోని నైగావ్ పోలీస్ గ్రౌండ్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మీ శుక్లా గౌరవ వందనాన్ని అందుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ”37 ఏండ్ల 6 నెలలు సేవ చేసిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నేను రిటైర్ అవుతున్నా. నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మహారాష్ట్ర పోలీస్ నాకు చాలా ఇచ్చింది. నేను చాలా నేర్చుకున్నా. నేను చాలా సంతృప్తిలో ఉన్నా” అని ఆమె చెప్పారు. తొలి మహిళా డీజీపీగా తన అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ పోస్ట్‌కు లింగ భేదం ఉండదనీ, పని మాత్రం ఒకేవిధంగా ఉంటుందని చెప్పారు. గతంలో తాను శాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) డీజీగా కూడా పని చేశాననీ, తనకు గర్వంగా ఉన్నదని తెలిపారు. కాగా మహారాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతె నియమితులయ్యారు.
మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీ రిటైర్
- Advertisement -
- Advertisement -



