నవతెలంగాణ-హైదరాబాద్ : సినీనటుడు మహేశ్‌బాబుకు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరించినందుకు మహేష్ బాబుకు ఈ నోటీసులు జారీ చేశారు.
కేసు వేసిన ఓ వైద్యురాలు, మరో వ్యక్తి.. రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనడానికి రూ.34,80,000 చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేశ్‌బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్‌లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండో ప్రతివాది అతికష్టం మీద కేవలం రూ.15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చారు. అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.