నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హీరో, ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘#SSMB29’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. షూటింగ్ కారణంగా తనయుడు గౌతమ్ పుట్టిన రోజును మిస్సయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. గౌతమ్ చిన్ననాటి ఫొటో షేర్ చేస్తూ ‘ఈ బర్త్‌డేకి నిన్ను మిస్ అవుతున్నా’ అనే క్యాప్షన్ జోడించిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ అభిమానులు, పలువురు నెటిజన్లు గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గౌతమ్ పుట్టినరోజున తాను అందుబాటులో లేకపోవడంపై ఎమోషనల్ అవుతూ.. 19వ వసంతంలోకి అడుగుపెట్టిన తనయుడికి మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’’ అని విష్ చేశారు. కాగా, రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.