నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ‘గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కొందరు ఆన్‌లైన్‌లో పాసులు విక్రయిస్తున్నారని, ఇది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని రాజమౌళి తెలిపారు. మీ పాసులపై క్యూఆర్ కోడ్‌లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే, వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయి” అని తెలిపారు. దారిపొడవునా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భద్రతా కారణాల దృష్ట్యా 18 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈసారి భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇది మనందరి భద్రత కోసమేనని రాజమౌళి అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి, ఈవెంట్ ను విజయవంతం చేయాలని కోరారు.
ఈ ఈవెంట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, స్క్రీన్ (100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు) ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఇంటి నుంచే జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.



