20 మంది మృతి… 534 మందికి గాయాలు
పలు గ్రామాల్లో నేలమట్టమైన ఇండ్లు
రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత
అంతకుముందు పలుమార్లు కంపించిన భూమి 
కాబూల్ : అఫ్గానిస్తాన్‌ను భారీ భూకంపం సంభవించింది. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో సోమవారం ఉదయం 6.3 తీవ్రతతో భూమి ప్రకంపించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. 534 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అంతకుముందు 10 కిలోమీటర్ల లోతులో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తెలిపారు. కాబుల్, బాల్, సమంగాన్ ప్రావిన్సులలోనూ భూప్రకంపనలు వచ్చాయని పేర్కొన్నారు. మజార్-ఇ-షరీఫ్ సమీపంలోని 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కేమెనిస్థాన్ సరిహద్దు దేశాల్లోనూ భూకంప ప్రభావం ఉన్నట్టు పేర్కొంది. 
భూకంపం నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఘోర విపత్తు కారణంగా మజార్-ఎ షరీఫ్ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్టు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వివరించారు. విపత్తు ధాటికి అనేక కుటుంబాలు కకావికలమయ్యాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన భారీ భూకంపంలో 2,200 మందికిపైగా మృతి చెందారు. మరో 3వేల మంది గాయపడ్డట్టు చెప్పారు. భూకంపం ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు వల్ల దాదాపు 12,000 మంది ప్రత్యక్షంగా ప్రభావితులైనట్టు తెలిపారు.
మయన్మార్‌లో 4.5తీవ్రతతో భూకంపం
మయన్మార్‌లో 4.5తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.03 గంటల సమయంలో 90 కిలోమీటర్ల లోతులో భూమి ప్రకంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. అంతకుముందు శనివారం కూడా 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

