బందీలను వెనక్కి రప్పించుకోండి
గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్
వాషింగ్టన్ : గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై జరుగుతున్న చర్చలలో పురోగతి సాధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య గత 20 నెలలుగా గాజాలో పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉత్తర గాజా నుండి ప్రజలను పెద్ద ఎత్తున ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల విరమణపై చర్చల కోసం ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ సలహాదారు ఈ వారం వాషింగ్టన్ వెళుతున్నారు. రాబోయే వారాలలో నెతన్యాహూ కూడా అమెరికా వెళ్లే అవకాశం ఉన్నదని ఇజ్రాయిల్ అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల విరమణపై ఒప్పందం దిశగా ఓ కదలిక వస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే కొందరు పాలస్తీనీయులు మాత్రం చర్చలపై పెదవి విరిచారు.
నెతన్యాహూ ఆదివారం సాయంత్రం భద్రతా క్యాబినెట్‌తో సమావేశమయ్యారు. ఒప్పందంపై వారితో చర్చించారని, అయితే అది ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి చెప్పారు. ఇదిలావుండగా ‘గాజాలో ఒప్పందం కుదుర్చుకోండి.బందీలను వెనక్కి రప్పించుకోండి’ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రాబోయే వారంలోనే ఒప్పందం కుదరవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనిమిది వారాల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
అయితే తదుపరి చర్యలకు సంబంధించి తన నిబంధనలకు హమాస్ అంగీకరించాలని ఇజ్రాయిల్ పట్టుపట్టింది. ఆ తర్వాత యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ‘ బందీలను విడుదల చేస్తే యుద్ధాన్ని ఆపేస్తామని పోరు ప్రారంభమైనప్పటి నుంచి వారు మాకు హామీ ఇస్తూనే ఉన్నారు. కానీ వారు యుద్ధాన్ని ఆపింది లేదు’ అని ఓ పాలస్తీనా పౌరుడు చెప్పాడు.
ఇదిలావుండగా గాజాలో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో ఓ ఇల్లు ధ్వంసమైంది. అందులో ఆశ్రయం పొందుతున్న పదిహేను మంది నిర్వాసితులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే సగం మంది ఉన్నారు. హమాస్, ఇజ్రాయిల్ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో కాల్పుల విరమణ జరగడంతో వేలాది మంది ప్రజలు తిరిగి ఉత్తర గాజాలోని స్వస్థలాకు చేరుకున్నారు. అయితే వారందరినీ ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తూర్పు, ఉత్తర గాజా సిటీ పరిసర ప్రాంతాలు, జబాలియా శరణార్థి శిబిరాన్ని కూడా ఖాళీ చేయించాలని తెలిపింది. దీంతో గాజా నగరంలోని పాలస్తీనీయులు తమ పిల్లలు, సామానులు, ఇతర అత్యవసరాలను గాడిద బండ్లపై వేసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నారు.