Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

సీపీఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

- Advertisement -

రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ొ ఆగస్టు 19-22 వరకు రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌

సీపీఐ రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 19 నుంచి 22 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని మహారాజ గార్డెన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం కుత్బుల్లాపూర్‌ షాపూర్‌నగర్‌ ఏఐటీ యూసీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌.బోస్‌ అధ్యక్షతన ఆహ్వాన సంఘం కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభ నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చిన పార్టీ మేడ్చల్‌ జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మహాసభకు జాతీయ నేతలు, అన్ని జిల్లాల నుంచి దాదాపు 1000 మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై, రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులపై చర్చలు జరిపి తీర్మానాల రూపంలో భవిష్యత్‌ పోరాటాల రూపకల్పనకు మహాసభ వేదిక కానుందన్నారు. మహాసభల విజయవంతానికి ప్రజల నుంచి సహాయ సహకారాలు తీసుకుని, వారిని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టు లను, అమాయక గిరిజనులను హతమారుస్తు న్నదని, తక్షణమే కగార్‌ను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, సీజ్‌ ఫైర్‌ను ప్రకటించాలని సీపీఐ డిమాండ్‌ చేస్తోందన్నారు. పహల్గాంలో ఉగ్ర వాదుల దాడిలో 27మందికి పైగా మరణించారని, ఇప్పటి వరకు ఆ దుండగులను కేంద్రం పట్టుకోలేకపోయిందని అన్నారు. పాకిస్థాన్‌తో భారత్‌ యుద్ధాన్ని ఆపానన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ మాటలను బట్టి ప్రధాని మోడీ మన దేశాన్ని ట్రంప్‌కు తాకట్టు పెట్టారని తెలుస్తోందన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిన మోడీకి ప్రధానిగా కొనసాగే నైతికత లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ సీనియర్‌ నేత పిజె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభ నిర్వహణ అంటే పార్టీ నూతనోత్సాహానికి, పార్టీ ఎదుగుదలకు తార్కాణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు ఎండీ.యూసుఫ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఎం.నర్సింహా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి.సాయిలు గౌడ్‌, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి ఈ.ఉమామహేష్‌, హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు యేసు రత్నం, జి.దామోదర్‌ రెడ్డి, జె.లక్ష్మీ, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పి.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -