– యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్
నవతెలంగాణ-సంగారెడ్డి
ఈ నెల 18న సంగారెడ్డిలో జరగనున్న మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభల్లో వైద్య శాఖలో ఉన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా పర్మినెంట్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వెంటనే పీఆర్సీ ఇవ్వాలని, డీఏ బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతాలు పెండింగ్‌లో పెట్టకుండా ఏ నెలది ఆ నెల ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలని, 104, 108, 102 ఆరోగ్యశ్రీ మిత్రులకు, టీ సాక్స్ ఇతర స్కీముల్లో పనిచేసే వాళ్లందరికీ వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేసే పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గాడ్స్ తదితరులకు కనీస వేతనం రూ.26,000 చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో అనేక ఉద్యమాలు చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. యాదగిరి మాట్లాడుతూ.. మహాసభల జయప్రదానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు చెప్పారు. ఆహ్వాన సంఘం చీఫ్ పాటర్న్ బి.మల్లేష్, జి. సాయిలు మాట్లాడుతూ.. జిల్లాలోని కార్మిక వర్గం సహాయసహకారాలతో మహాసభలను జయప్రదం చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లా అని, ఈ జిల్లాలో యూనియన్ రాష్ట్ర మహాసభలు జరగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం కోశాధికారి మహిపాల్, నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



