నవతెలంగాణ – జన్నారం
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ జిల్లా నాయకులు కే బుచ్చయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని, పొనకల్, బుడగ జంగాల కాలనీలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2025 అక్టోబర్ 26, 27 తేదీలలో ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభ, మరియు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు.
పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే నిర్వాహకుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, నెలలు గడిచిన పెండింగ్ బిల్లులు జీతాలు ఇవ్వటం లేదని, అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం టిఫిన్లు పెట్టాలంటూ మండల విద్యాశాఖ అధికారులు, మిడ్ డే మీల్స్ కార్మికులపై ఒత్తిడి చేసి మరీ టిఫిన్లు పెట్టించారు. ఒక్కొక్క నిర్వాహకులు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు అప్పుచేసి టిఫిన్లు పెట్టారు. అట్టి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు.
ఇలా అన్ని సమస్యలు చర్చించుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవటానికి కార్యక్రమం రూపొందించుకోవాలి. నిరంతరం మిడ్ డే మీల్స్ కార్మికుల సంక్షేమం కోసం పోరాడే సంఘం రాష్ట్ర మహాసభలకు కార్మికులందరూ వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు , సేపూరు లక్ష్మి సంఘ జిల్లా కమిటీ సభ్యులు, మంజుల, సువర్ణ, రాజేశ్వరి,మీరా,గౌరీ, వెంకటవ్వ,పోసవ్వ , దుబ్బావా తదితరులు పాల్గొన్నారు.