నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రజా సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశం వనం రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈనెల 9న మంగళవారం రోజు పట్టణ కేంద్రంలోని దివ్య ఫంక్షన్ హాల్ లో తెలంగాణ సాయుధ పోరాటం ప్రజా విజయాలు-వాస్తవాలు-వక్రీకరణలు అనే అంశంపై జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం జాకీర్దారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమని అన్నారు. బానిసత్వంతో బ్రతుకుతున్న ప్రజలను సంఘటితం చేసి ప్రజలను విముక్తి చేశారని అన్నారు. గెరిల్లా ఉద్యమాలను నడిపి 3000 గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాలను పేద ప్రజలకు భూమిని పంచిన మహోన్నత పోరాటం సాయుధ రైతాంగ పోరాటం అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరులో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు. దోపిడి ,పీడన అసమానతలతో బానిస బ్రతుకుల విముక్తికై కుల ,మతాల అతీతంగా జరిగిన ఈ పోరాటం దేశ విదేశాలను ఆకర్షించిందని అన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని వెలుగెత్తి చాటిందని అన్నారు.
ఎలాంటి త్యాగచరితలేని, పోరాట వారసత్వం లేని ప్రజా అభ్యుదయం లేని, మతోన్మాద అవకాశవాద రాజకీయాలకు తెరలిపిన బిజెపి, సంఘ్ పరివార శక్తులు మహోజ్వల వీర తెలంగాణ పోరాట చరిత్రను మతోన్మాద దుష్టత్వం నుండి చూసి వికృత భాష్యాలు చెప్పి ప్రజలు నిర్మించిన చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న మతోన్మాద శక్తుల ప్రచారాలను ప్రజలంతా తిప్పికొట్టలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, కల్లూరి నాగమణి, పట్టణ కమిటీ సభ్యులు వల్దాస్ అంజయ్య, పర్వతం బాలకృష్ణ పాల్గొన్నారు.