నవతెలంగాణ – మిడ్జిల్
రాజకీయాలకు అతీతంగా మల్లాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ సంధ్య-బంగారు అన్నారు. శుక్రవారం గ్రామంలో మాజీ సర్పంచ్ జంగారెడ్డితో కలిసి పారిశుద్ధ పనులను చేపట్టారు. అభివృద్ధితో పాటు గ్రామము కూడా పారిశుభ్రతగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తన గ్రామ ప్రజలకు మాట ఇచ్చానని, దాన్ని నెరవేర్చేందుకు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.
గ్రామపంచాయతీ నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని, అంతవరకు ప్రజలు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో తన సొంత నిధులను వెచ్చించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రతను కాపాడుకోవడానికి మరుగు కాలువలు శుభ్రం చేయడం, చెత్తాచెదారం తొలగించడం వంటి పనులను చేపట్టామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, శేఖర్ గ్రామస్తులు రామచంద్ర రెడ్డి ,రవీందర్, దశరథ చారి, పర్వతాలు యాదవ్, బాలరాజ్ గౌడ్, శేఖర్, బీమాజీ గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



