Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం

మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం

- Advertisement -

– ఆమెను ప్రపంచానికి పరిచయం చేద్దాం
– కుటుంబాన్ని, ఉద్యమాలను సమన్వయం చేసిన మహిళ : ‘ది ఫైర్‌ ఆఫ్‌ డెఫియెన్స్‌’ పుస్తకావిష్కరణలో ఎస్‌.పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా వ్యవ స్థాపకుల్లో ఒకరైన మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి కొనియాడారు. ఆదివారం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణజ్యోతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ‘ది ఫైర్‌ ఆఫ్‌ డెఫియెన్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరోచిత పోరాటానికి మారుపేరుగా నిలిచిన మల్లు స్వరాజ్యం జీవితాన్ని ప్రపంచమంతా తెలుసుకునేలా ఆమె జీవితం, ఉద్యమ రచనలను ఇంగ్లీష్‌లోకి రావడం ముదావహమన్నారు. ప్రపంచంలో అక్కడక్కడా తలెత్తిన చిన్న చిన్న పోరాట ఘట్టాలను కూడా వందలాది మంది రచయితలు భిన్న కోణాల్లో ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారంటూ మేరీ హ్యారీ జోన్స్‌ పోరాటాన్ని ఉదహరించారు. ప్రాణాలు కోల్పోయి, కుటుంబాలు ఛిద్రమైన ప్రజల కోసం నిలబడ్డ తెలంగాణ సాయుధ పోరాట వీరుల చరిత్ర నేటి తరానికీ, ప్రపంచానికి పూర్తిగా తెలియకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మన గ్రామాల్లో జరిగిన పోరాటం, అందులో మహిళలు, పిల్లల పాత్రలు లిఖితం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అజ్ఞాతంలో పోరాడిన మల్లు స్వరాజ్యం జనారణ్యంలోనూ పోరాడిందని తెలిపారు. కుటుంబానికి కష్టమొచ్చినా భర్తను పోరాటం నుంచి వెనక్కి రావాలని కోరుకోలేదనీ, కుటుంబ బాధ్యతలన్ని తానే మోసిందని గుర్తుచేశారు. జీవితానుభవం, ఉద్యమానుభవం, సైద్ధాంతిక అవగాహన నుంచి భావ ప్రధానంగా సరళమైన, వ్యవహారిక భాషలో తెగింపుతో సామాన్యుల కోసం నిలబడిన మల్లు స్వరాజ్యం జన నాయకురాలిగా నిలిచిపోయారని గుర్తుచేశారు. ఆమె తుపాకి పట్టినా, నాగలి పట్టినా, పిల్లలను కనిపెంచినా, కుటుంబ భారం మోసినా అన్ని విషయాలను సమన్వయం చేసుకుని జీవించినమహిళగా ఆమె జీవితంలో అందరూ అనుసరిం చాల్సిన, అనుకరించాల్సినవే ఉన్నాయని చెప్పారు.
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చాలామంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి, ఆ పోరా టంలో మహిళల పాత్ర గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తు న్నారని తెలిపారు. మల్లు స్వరాజ్యం కార్యకర్తలను తనతో సమానంగా చూసుకునేదని గుర్తుచేశారు. ఆ చరిత్రను కనుమరుగు కాకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఐద్వా సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ మాట్లాడుతూ ఉత్తర భారతదేశ పోరాట ఘట్టాలు తెలుగులోకి వస్తున్నాయనీ, అదే విధంగా స్థానిక పోరాటాలను వారికి తెలుసులే అనువాదాలు ఎక్కువగా జరగాలని ఆకాంక్షించారు. మల్లు స్వరాజ్యం జీవితం చదివిన ప్రతిసారి ఒక్క విషయం అర్థమై స్ఫూర్తి పొందుతామని తెలిపారు. తోడబుడ్డిన అక్కకు ఆస్తిలో వాటా కోసం కొట్లాడిన ఆమె దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రభుత్వంతో పోరాడి మహిళలకు కావాల్సిన ప్రధానమైన ఆరు డిమాండ్లను సాధించారని గుర్తుచేశారు. మనిషిలో చాలా శక్తి ఉంటుందనీ, మల్లు స్వరాజ్యానికి పరిపూర్ణ జీవితమని కొనియాడారు. భూమిక ఎడిటర్‌ కొండవీటి సత్యవతి పుస్తకాన్ని పరిచయం చేశారు. వయస్సు పెరిగిన ఉత్సాహం తగ్గనీ, ముక్కుసూటిగా మాట్లాడే మల్లు స్వరాజ్యం వ్యక్తిత్వం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అలుపెరగని పోరాట కెరటం, ప్రజలను చదివిన జనం మనిషి, భూస్వాముల దాష్టీకాలకు వ్యతిరేకంగా నిలిచిన భూస్వామి కూతురు, ప్రజలు గుండెల్లో దాచుకున్న గొప్ప నాయకురాలు అని గుర్తుచేశారు.
ప్రజలే బంధువులుగా బతికిన మల్లు స్వరాజ్యం :
మల్లు లక్ష్మి
ముళ్లబాటను ఛేధించుకుంటూ ముందుకెళ్లిన ఆదర్శవంతమైన జీవితం మల్లు స్వరాజ్యానిదని ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. ”ఎదురయ్యే సమస్యలతో క్షణం బాధపడ్డ వెంటనే తేరుకుని కార్యాచరణకు పూనుకునేది. తండ్రి, అన్న, భర్త చూపించిన బాటలో భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా నిలబడింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత జీవితం గడపడానికి అనేక కష్టా లను ఎదుర్కొన్నది. దళితులు, అణగారిన వర్గాల ఇండ్లలో భోజనం చేస్తుందని బంధువులు వెలివేసినా వెనుదిరగలేదు. ప్రజలను బంధువు లుగా భావించింది. నన్ను తల్లిగా, అత్తగా, స్నేహితురాలిగా చదివిం చింది. ప్రోత్సహించింది. అన్ని విధాలుగా అండగా నిలిచింది. బాలికలు ఆత్మరక్షణ శిక్షణ, కుటుంబాలకు కౌన్సిలింగ్‌ అవసరమని ఎప్పుడూ చెప్పే ది. ఆమె ఆశయాలను కొనసాగిద్దాం. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇప్పటికే ప్రభుత్వానికి మల్లు స్వరాజ్యం పేరుతో ఎకరం స్థలం కేటాయించాలనీ, ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఆవిష్క రించాలని కోరాం..” అని మల్లు లక్ష్మి తెలిపారు. ది ఫైర్‌ ఆఫ్‌ డెఫియెన్స్‌ పుస్తకాన్ని తీసుకురావడానికి అహర్నిశలు పని చేసిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ గీతారామస్వామికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం పిలుపుతో ఉద్యమంలోకి వచ్చిన, కలిసి పని చేసిన పలువురు ఆమెతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్య క్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌.రత్నమాల, సీనియర్‌ నాయకురాలు డి.ఇందిర, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎమ్‌. వినోద, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.శశికళ, వై.వరలక్ష్మి, షబాన బేగం, విమల, బొప్పని పద్మ, లక్ష్మయ్య, గౌరి, విజయమ్మ, రాజలక్ష్మి, ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -