Friday, March 20, 2026
E-PAPER
Homeజిల్లాలుమండల వాసికి అమెరికాలో సామాజిక సేవకుడిగా ప్రత్యేక గుర్తింపు 

మండల వాసికి అమెరికాలో సామాజిక సేవకుడిగా ప్రత్యేక గుర్తింపు 

- Advertisement -

సేవలకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు 
న్యూజెర్సీలో ఘణంగా సత్కారం
నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం, డిండి  చింతపల్లి గ్రామానికి చెందిన ఇందుర్తి బాలకిష్ట రెడ్డి అమెరికాలో ప్రముఖ సామాజిక సేవకుడిగా గుర్తింపు పొందుతున్నారు. మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన బాలకిష్ట రెడ్డి ఇందుర్తి 1992లో అట్లాంటాలో స్థిరపడ్డారు.

2004 నుంచి భారతీయ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామ), ఆప్నా ఫౌండేషన్,  శకర నేత్రాలయ యు.ఎస్.ఎ  సంస్థలకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. సేవా కార్యక్రమాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిధుల సేకరణలో ఆయన చేసిన కృషికి గాను శంకర రత్న పురస్కారం అందుకున్నారు.

2016లో శంకర నేత్రాలయ సంస్థలో ట్రస్టీగా చేరిన ఆయన, 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థను 7 నుంచి 29 శాఖలకు విస్తరించడంలో తీవ్రంగా కృషి చేశాడు. 2025లో ఆయన ఆధ్వర్యంలో సుమారు 2 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించడం ఆయన సేవా తపనకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు “మొబైల్ ఐ సర్జికల్ యూనిట్” (మెసు) కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్, పుట్టపర్తి, ఎట్టయపురం ప్రాంతాల్లో మూడు యూనిట్లను ఏర్పాటు చేయించడం ద్వారా వేలాది మందికి చూపు వెలుగులు నింపుతున్నారు. ఇటీవల న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ పట్టణంలో ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఘనంగా సత్కరించాయి.

 గ్రామీణ నేల నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగి, సేవతో సమాజానికి వెలుగునిస్తున్న  ఇందుర్తి బాలకిష్ట రెడ్డి  నిజంగా యువతకు స్ఫూర్తి ప్రతీకగా నిలుస్తున్నారు. తెలంగాణ గర్వకారణంగా నిలిచిన ఈ సేవామూర్తికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -