ఆత్మకూర్ : ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న (57) అలియాస్ నాగన్న, అలియాస్ విజరు మృతి చెందినట్లు సమాచారం. చిన్నన్నకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. వడ్ల రామాపురం గ్రామానికి చెందిన చిన్నన్న 1992లో సాధారణ గ్రామ రైతు కూలీ సంఘం సభ్యుడిగా పనిచేస్తున్న నేపథ్యంలోనే విప్లవ ప్రస్థానం మొదలుపెట్టారు. రైతు కూలి సంఘం ఏరియా కమిటీ అధ్యక్షుడిగా భవనాసి నక్సలైట్ దళ సభ్యుడిగా, భవనాసి కమాండర్‌గా పనిచేశారు. నక్సలైట్ల ఉద్యమంలో వివిధ కమిటీలలో ఆయన పని చేశారు. ప్రస్తుతం రాజ్‌నందుగావు కాంకేర్ సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. చిన్నన్న మృతి చెందిన విషయం వడ్లరామాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నన్నపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని తీసుకురావడానికి ఆయన కుమారుడితోపాటు మరికొందరు ఛత్తీస్‌గఢ్ వెళ్లినట్లు సమాచారం. చిన్నన్న మృతదేహాన్ని శనివారం వడ్ల రామాపురానికి తీసుకురావచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.