న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి విక్రయాల్లో 3 కోట్ల యూనిట్ల మైలురాయిని చేరినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. 1983 డిసెంబర్ 14న మారుతీ 800తో కార్ల తయారీని ప్రారంభించింది. తొలి కోటి కార్ల విక్రయాలకు తమకు 28 సంవత్సరాల 2 నెలలు పట్టిందని తెలిపింది. తర్వాతి కోటి వాహనాలను దాదాపు ఏడున్నరేళ్లు, మిగిలిన కోటి వాహనాలకు 6 సంవత్సరాల 4 నెలలు పట్టిందని ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో అత్యధికంగా 47 లక్షల ఆల్టోలను విక్రయించినట్లు వెల్లడించింది. తర్వాతి స్థానంలో వ్యాగనార్ 34 లక్షలు, స్విప్ట్ 32 లక్షలు చొప్పున అమ్మకాలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ప్రతి వెయ్యి మందిలో 33 మంది వద్ద మాత్రమే కార్లు ఉన్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండి, సిఇఒ హిశాషి టెకుచి తెలిపారు.



