క్రమశిక్షణతో మార్క్సిజాన్ని పాటించిన వ్యక్తి ఇనుపనూరి జోసఫ్ : సంస్మరణ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
అనేక రుగ్మతలతో కూడిన ప్రస్తుత దోపిడీ సమాజ మార్పునకు మార్క్సిజమే మార్గమని, నమ్మినవాడు కామ్రేడ్ ఇనుపనూరి జోసఫ్ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఖమ్మంలోని మంచికంటి భవనంలో బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన ఇనుపనూరి జోసఫ్ సంస్మరణ సభ జరిగింది. ముందుగా జోసఫ్ సార్ చిత్రపటానికి తమ్మినేని, నున్నా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. జోసెఫ్ మార్క్సిస్టు సైద్ధాంతిక విషయాలను అధ్యయనం చేయడంలో, వాటిని నిత్య జీవిత కార్యాచరణకు అన్వయించడంలో తగిన క్రమశిక్షణను పాటించేవారని కొనియాడారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ ఆయన ఒక మంచి మార్క్సిస్టు ప్రచారకునిగా కృషి చేశారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయిన తర్వాత అనేక సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బీవీకే) మేనేజింగ్ కమిటీ సభ్యులుగా, ఆదివారం మీకోసం కమిటీ నిర్వాహకులుగా, స్టడీ సర్కిల్ సభ్యులుగా అనేక రూపాల్లో ఆయన కార్యకలాపాలను నిర్వహించారని అన్నారు. మార్క్సిస్టు స్టడీసర్కిల్‌లో ఒక సభ్యునిగా పాల్గొంటూ, మార్క్సిజం-లెనినిజం సైద్ధాంతిక విషయాలను కొత్త తరానికి అందించడం కోసం తపన పడేవారని తెలిపారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జోసఫ్.. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో టీచర్‌గా, లెక్చరర్‌గా పనిచేస్తూ అనేక వందల మంది విద్యార్థులకు విద్యాబోధన చేశారని తెలిపారు. వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాల్లో పనిచేసే కార్యకర్తలను నిరంతరం ప్రోత్సహించేవారని, వారికి సహకరించేవారిని గుర్తు చేశారు. మార్క్సిస్టు సాహిత్యాన్ని భద్రపరుస్తూ తన చుట్టూ ఉన్న వారికి అందించడంలో ఆయన నిత్యం కృషి చేసే వారన్నారు. పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతం పట్ల జోసఫ్ సార్ అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవారని కొనియాడారు. ఈ సందర్భంగా జోసఫ్‌కు ఘనంగా నివాళులు అర్పించి, కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేశ్, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేశ్, నందిపాటి మనోహర్, ఎస్‌కే.మీరా, నాయకులు టిఎల్.నర్సయ్య, ఆర్.ప్రకాష్, బీవీకే బాధ్యులు ఎస్కే ఆఫ్జల్, వాసిరెడ్డి వీరభద్రం, ఎస్.నాగేశ్వరరావు, తుమ్మల వెంకటరావు, ఎస్.గోవింద్‌రావు, ఎన్.పురుషోత్తంరావు, జోసఫ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక మార్పునకు మార్క్సిజమే మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



