నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థిని అగ్నిప్రమాదం వల్ల మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ ఆల్బనీలో సహజరెడ్డి ఉడుమల (24) మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. తాను ఉంటున్న నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో సహజ ఉడుమల మృతి చెందారు అని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఎక్స్ పోస్టులో పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె కుటుంబ సభ్యులకి సానుభూతి వ్యక్తం చేసింది. ఉడుమల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధమని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.
కాగా, గురువారం (డిసెంబర్ 4) ఉదయం ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదానికి తమ సిబ్బంది, అల్బానీ అగ్నిమాపక విభాగం స్పందించినట్లు అల్బానీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇల్లు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నట్లు, ఇంటి లోపలే చాలామంది వ్యక్తులు ఉన్నట్లు వారు గుర్తించారు. దురదృష్టవశాత్తు ఈ మంటల్లో చిక్కుకున్న సహజ మృతి చెందినట్లు పోలీసు శాఖ తెలిపింది. సహజ బంధువు రత్న గోపు, ఆమె అంత్యక్రియల ఖర్చులకు, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపడానికి గల రవాణా ఏర్పాట్లకు నిధులను సేకరిస్తున్నారు.



