నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రెడ్ కమాండ్ ముఠా లక్ష్యంగా భద్రతా బలగాలు పెద్దఎత్తున ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో అధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపుల్లో రెడ్ కమాండ్ ఒకటి. ఈ గ్రూపును లక్ష్యంగా చేసుకునేందుకు దాదాపు ఏడాది పాటు ప్రణాళిక రచించినట్లు భద్రతాధికారులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 2,500 మంది సాయుధ బలగాలు పాల్గొన్నాయని వెల్లడించారు. కొన్ని గంటల పాటు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతాధికారులతో సహా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 81 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రియో చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్‌గా అభివర్ణించారు. దాడుల సమయంలో సమీపంలోని 46 పాఠశాలలను మూసివేసినట్లు తెలిపారు.
ఆపరేషన్‌కు ప్రతీకారంగా.. అధికారులే లక్ష్యంగా దాడి చేసుకునేందుకు ముఠాలు డ్రోన్‌లు ఉపయోగించాయని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. తమపై దాడులు జరిపినా భద్రతా బలగాలు వెనక్కి తగ్గకుండా ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయని వెల్లడించింది. సాయుధ బలగాలు చేసిన ఈ హింసాత్మక ఘటనను పలు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ బ్రెజిల్ డైరెక్టర్ సీసార్ మయోజన్ మాట్లాడుతూ.. ఈ హింసాత్మక ఘటన పెద్ద విషాదకరమన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కూడా ఖండించింది. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసిందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనిపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది.



