నవతెలంగాణ-హైదరాబాద్: వేతనాలు 30శాతం పెంచాలని సినీ కార్మికులు పలు రోజులుగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కృష్ణానగర్ నుంచి 24 యూనియన్ల కార్మికులు భారీగా తరలి వచ్చారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్మాతల నిర్ణయం తీసుకున్నారు. అయితే.. నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి చెందాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ.. కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ షూటింగ్స్ జరగవని, నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదన్నారు. మేము ఛాంబర్‌తో మాత్రమే మాట్లాడతామని స్పష్టం చేశారు. పీపుల్స్ మీడియా మాకు రూ. 90 లక్షల బకాయి ఉందని ఆరోపించారు. చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారని, మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారని, రేపు మంత్రిని కలవనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ లేదని ఎలా అంటారు.. అని ఫైటర్స్ యూనియన్ కార్మికులు మీడియాతో మాట్లాడారు. వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేస్తారా..? వచ్చే ఆదాయంలో మేము వాటాలు అడగట్లేదని నిలదీశారు.