తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73.7 లక్షలు
ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఈసీఐ
అనుకూల ఓటర్లుండేలా బీజేపీ ఓట్‌చోరీ: ప్రతిపక్షాలు
చెన్నై : పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్‌తో సహా మూడు రాష్ట్రాలు , రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించిన కొన్ని రోజుల తర్వాత శుక్రవారం తమిళనాడు, గుజరాత్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలను దెబ్బతీయటానికే సర్ ప్రక్రియను ఈసీఐ చేపట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మైనార్టీ వర్గాల ఓట్లను తొలగిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఓట్‌చోరీ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(సర్) ప్రక్రియ ద్వారా తమిళనాడు, గుజరాత్‌లో భారీగా ఓటర్లను తొలగించారు. తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్‌లో 73.7 లక్షల ఓట్లకు కోత పెట్టారు.
ఈ మేరకు శుక్రవారం ఈసీఐ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. వలసలు, మరణం, నకిలీ నమోదు వంటి పలు కారణాలతో ఈ ఓట్లను తొలగించినట్టు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అందించిన డేటా ప్రకారం తమిళనాడులో తొలగించిన 97 లక్షల ఓటర్లలో… వలస వెళ్లిన 66.4 లక్షల మందిని ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. మరో 26.9 లక్షల మంది మరణించినట్టు గుర్తించారు. 3.98 లక్షల మంది ఓటర్లు పలు చోట్ల నమోదైనట్టు కనుగొన్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా 5.43 కోట్ల మంది ఓటర్ల నుంచి గణన పత్రాలు సేకరించినట్టు తెలిపింది. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 84.81 శాతానికి సమానం. డిసెంబర్ 19, 2025 నాటికి, ”6,41,14,587 మంది ఓటర్లలో 5,43,76,755 మంది ఓటర్లు తమ గణన పత్రాలను సమర్పించారు.
జనవరి 18 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు గడువు
తమిళనాడు, గుజరాత్ సీఈఓ కార్యాలయం… సవరించిన జాబితాలో అర్హులైన ఓటర్లను చేర్చడానికి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు గడువు జనవరి 18, 2026 వరకు ఉంటుందని తెలిపింది. అదే విధంగా ”అర్హులైన ఓటర్లు డిసెంబర్ 19, 2025 నుంచి జనవరి 18, 2026 లోగా ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చవచ్చు,” అని పేర్కొంది.
గుజరాత్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
గుజరాత్ ముసాయిదా ఓటర్ల జాబితాలో సుమారు 73.7 లక్షల ఓట్లను తొలగించారు. గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి అందించిన డేటా ప్రకారం, ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 18.07 లక్షల మంది ఓటర్లు మరణించినట్టు గుర్తించి..వాటిని తొలగించారు. 51.86 లక్షల మంది ఓటర్లు ”మకాం మార్చారు/ గైర్హాజరు” అని గుర్తించి..ఆ పేర్లను తీసివేశారు. 3.81 లక్షల మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నట్టు గుర్తించారు.



