నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ ముసురుకున్న వివాదాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తొలిసారి బహిరంగంగా అంగీకరించారు. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని అంగీకరించిన ఆయన, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. “నేను, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి దీనికి ఒక ముగింపు పలుకుతాం” అని ఆయన మీడియాకు తెలిపారు. 2023 ఎన్నికల తర్వాత సీఎం పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలనే ఒప్పందం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో ఈ సంక్షోభం ముదిరింది. ఆ గడువు సమీపించడంతో డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. వారిలో ఒకరైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ… 200 శాతం డీకే శివకుమార్ త్వరలో సీఎం అవుతారు అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలపై డీకే శివకుమార్ ఆచితూచి స్పందించారు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా తాను బహిరంగంగా మాట్లాడనని, అయితే ఆశలు కలిగి ఉండటంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. మరోవైపు, సీఎం సిద్ధరామయ్య కూడా అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని, ఈ గందరగోళానికి తెరదించాల్సిన బాధ్యత హైకమాండ్‌దేనని పేర్కొన్నారు. గత వారం వరకు పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా బీజేపీ సృష్టిస్తున్న ప్రచారమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పడం గమనార్హం. డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో రాహుల్ గాంధీతో ఖర్గే భేటీ అయి, ఆ తర్వాత ఇరువురు నేతలను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


