– వినాయక విగ్రహాల తరలింపుతో విద్యుత్ అంతరాయాలు
– 11 మీటర్ల ఎత్తున విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో కొద్ది రోజులుగా తరచు విద్యుత్ అంతరాయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని యువత తీసుకువచ్చే భారీ విగ్రహాలతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రానికి పక్కనే ఉన్న జగిత్యాల జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రతిష్టించేందుకు యువకులు భారీ విగ్రహాలను తరలిస్తున్నారు. వినాయక విగ్రహాలు తరలించే సమయంలో 63వ నెంబర్ జాతీయ రహదారిపై పెద్ద లైన్లు ఉన్న, రోడ్డు క్రాసింగ్ ల వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగేలతో ప్రమాదాలు జరక్కుండా ఉండేందుకు సిబ్బంది మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. జగిత్యాల జిల్లా వైపు మండల కేంద్రం ప్రారంభం నుంచి మోర్తాడ్ వెళ్లే దారిలో హెచ్ పి పెట్రోల్ పంపు దాటేవరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భారీ విగ్రహాలను సుమారు రెండు కిలోమీటర్ల దూరం దాటించేందుకు గంటల సమయం పడుతుంది.
అంతసేపు ఏ సమయంలోనైనా విద్యుత్ సరఫరా నిలిపి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. వినాయక చవితి పండుగ వేళ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విగ్రహాల తరలింపు కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో భారీ విగ్రహాలను మండల కేంద్రం దాటించే వరకు రాత్రి సమయంలో కూడా అరగంట, గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం పట్ల ప్రజలు విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వినాయక విగ్రహాలను తరలించిన విద్యుత్ తీగలు తాకకుండా ఉండేలా మండల కేంద్రంలో రోడ్డు క్రాసింగ్ లు ఉన్న మూడు చోట్ల 11 మీటర్ల ఎత్తయిన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, ఎత్తైన కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను సరి చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు- అన్నయ్య
మండల కేంద్రం గుండా భారీ విగ్రహాలను తరలించిన భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఏఈ అన్నయ్య తెలిపారు. భారీ విగ్రహాలను, ఎత్తయిన పరికరాలను తరలించే సమయంలో మండల కేంద్రం దాటే వరకు విద్యుత్ సరఫరాను ఇప్పటివరకు నిలిపి ఉంచాల్సిన పరిస్థితి ఉండేది. మండల కేంద్రంలో రోడ్డు క్రాసింగ్ లు ఉన్న మూడు చోట్ల పెద్ద లైన్లు ఉన్నాయి. వాటికి విగ్రహాలు, పరికరాలు తగిలితే ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంది. చిన్న లైన్లు ఉన్నచోట విద్యుత్ తీగలను కర్రలతో పైకి లేపొచ్చు, అంతగా ఇబ్బంది ఉండదు. కానీ పెద్ద లైన్లను మాత్రం కర్రలతో పైకి ఎక్కడ చాలా ప్రమాదకరం. అందుకే విద్యుత్ సరఫరాను నిలిపివేసి విగ్రహాలను దాటిస్తున్నాం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపి ఉంచాల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు మండల కేంద్రంలో రోడ్డు క్రాసింగ్ లు ఉన్న మూడు చోట్ల పెద్ద లైన్లను పైకెత్తేందుకు 11 మీటర్ల ఎత్తున విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ అంతరాయాలకు ఇకముందు ఆస్కారం ఉండదన్నారు.