Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఆయన జూమ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల గురుకు లాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పిల్లలపై ప్రిన్సిపాల్లు, టీచర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఏదైనా ఘటన జరిగినప్పుడుపై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడొద్దనీ, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం కోసమే ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచిందనీ, మెనూ ప్రకారం భోజనం అందించాలని నొక్కిచెప్పారు. పాఠశాల్లో శుభ్రత పాటించాలనీ, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గురుకులాల్లో ఏ ఘటన జరిగినా అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలనీ, ఇందులో విద్యార్థులు, టీచర్లు, ప్రిన్సిపల్‌ సభ్యులుగా ఉండాలన్నారు. ఈ కమిటీ సభ్యులు ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. నైట్‌ డ్యూటీ చేసే ఉపాధ్యాయులు పాఠశాల్లోనే విద్యార్థులకు అందుబాటులో ఉండాలనీ, ఆ పరిసరాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వారికి ఇచ్చే మందులను ఒకటికి రెండుసార్లు ఎంఎన్‌ఎంలు పరిశీలించాలనీ, అవసరమైన మందులు మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. భోజనం తయారు చేయడంలో, ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకొని దోమలు రాకుండా అన్ని హాస్టల్స్‌కి నెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. చాలా విద్యాసంస్థలు ప్రయివేటు బిల్డింగ్‌లోనే ఉన్నందున వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు, సంయుక్త కార్యదర్శి తిరుపతి, ఆర్‌సీవోలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -