18, 19వ తేదీల్లో సీఎం హాజరు
వరంగల్ నగర అభివృద్ధికి కృషి
స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ డీపీఆర్‌కు ఆదేశం
భూగర్భ డ్రయినేజీ పనులకు వారం రోజుల్లో టెండర్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడి
ఆరు జిల్లాల కలెక్టర్లతో మంత్రులు సమీక్ష
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో రెండో నగరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. మేడారం జాతరకు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల కలెక్టర్లతో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారం జాతరకు రూ.250 కోట్లతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయన్నారు. రాబోయే 200 ఏండ్లపాటు ఈ నిర్మాణాలను ప్రజలు గుర్తుంచుకునేలా నిర్మిస్తున్నామన్నారు.
ఈ నెల 18వ తేదీ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి మేడారంకు విచ్చేసి అక్కడే బస చేస్తారని, 19వ తేదీ ఉదయం గద్దెల ప్రాంగణం, పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. వరంగల్‌లో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. వరంగల్‌లో భూగర్భ డ్రయినేజీ నిర్మాణానికి రూ.4 వేల కోట్లకు పై చిలుకు నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. మొదటి దశ భూగర్భ డ్రయినేజీ పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. మరో రూ.570 కోట్లతో నగరంలో తాగునీటికి సంబంధించిన టెండర్లను పిలుస్తున్నట్టు తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, రెవెన్యూ సిబ్బందిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. మామునూరు ఎయిర్‌పోర్టు భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేసినందుకు వారిని మనస్పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందనలు తెలిపారు.
వరంగల్ నగరాన్ని హెల్త్‌హబ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగానే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. వరంగల్‌లో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో బీపీఎల్, బీపీఎల్ దిగువ శ్రేణి కుటుంబాలకు ఇండ్లను నిర్మించి ఇవ్వడానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేసి, పనులు పూర్తి చేయాలన్నారు. భద్రకాళి మాడవీధులు పూర్తిచేయడంతోపాటు భద్రకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీవల వరదలకు ముంపునకు గురైన మెగా టెక్స్‌టైల్స్ పార్క్ పరిసరాల్లో నివారణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు.
మేడారం జాతరను విజయవంతం చేయాలి : మంత్రి సీతక్క
మేడారం జాతరకు ఈనెల 18న సీఎం విచ్చేసి 19వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంతోపాటు జాతరను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి 6 నెలల ముందే రూ.100 కోట్లు విడుదల చేశారన్నారు. మాస్టర్‌ప్లాన్ విడుదల చేసి మేడారం అభివృద్ధికి దిశానిర్దేశం చేశారన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం సమీక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారంటూ ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, స్నేహ శబరీష్, రిజ్వాన్ బాషా, అద్వైత్‌కుమార్ సింగ్, రాహుల్ శర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



