నవతెలంగాణ – హైదరాబాద్: గత నెల 25వ తేదీన వనదేవతల జాతర పూజారి సిద్దబోయిన రాణా రమేష్.. మేడారం గద్దెల వద్దకు వచ్చిన భక్తులు, ప్రముఖ వ్యక్తులకు దర్శనం చేయించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ రోజున సాయంత్రం 5 గంటలకు.. రాణా రమేష్ కుమారుడు యువన్ కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న రాయిపై యువన్ కూర్చోగా.. ఒక్కసారిగా కింద పడిపోయాడు. అదే సమయంలో పై నుంచి రాయి వచ్చి అతడి కాళ్లపై పడింది. దీంతో ఒక కాలు నుజ్జు నుజ్జు అయింది. మరో కాలు విరిగింది. అది గమనించిన స్థానికులు వెంటనే.. హుటాహుటిన బాలుడిని ములుగు ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అదే రోజు పంపించారు. అప్పటి నుంచి యువన్కు హన్మకొండలో చికిత్స అందించారు. ఇందులో భాగంగానే డాక్టర్లు అనేక మెడికల్ టెస్ట్లు నిర్వహించారు. ఆ తర్వాత 2 కాళ్లకు ఆపరేషన్లు చేశారు. యువన్ కుడికాలు విరిగిపోవడంతో.. అతడికి ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇక ఎడమకాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పూర్తిగా రక్తప్రసరణ నిలిచిపోయిందని డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఉండగానే.. గురువారం పరిస్థితి విషమించడంతో.. బాలుడి ఆరోగ్యాన్ని రక్షించడం కోసం అతడి ఎడమకాలును తొలగించారు. కాలి మడమ కొంచెం పై వరకు యువన్ కాలును డాక్టర్లు తీసేశారు.



