Thursday, July 31, 2025
E-PAPER
Homeక్రైమ్రిమ్స్‌లో మెడికో ఆత్మహత్య

రిమ్స్‌లో మెడికో ఆత్మహత్య

- Advertisement -

– కన్నీరు పెట్టుకున్న తోటి విద్యార్థులు
– వైద్య కళాశాల ప్రాంగణంలో విషాదఛాయలు
– కమిటీ వేసి విచారణ చేపడతామన్న డైరెక్టర్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి సాహిల్‌ చౌదరి(19) బుధవారం హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌కు చెందిన సాహిల్‌ చౌదరి ఉదయం తోటి విద్యార్థులతో కలిసి ఉదయం టిఫిన్‌ చేశాడు. క్లాస్‌ రూంకి వెళ్లే సమయంలో హాస్టల్‌ గదికి వెళ్లాడు. తన రూంలో ఫ్యాన్‌కు డోర్‌ కర్టెన్‌తో ఉరేసుకున్నాడు. క్లాస్‌ సమయం అవుతుండటంతో తోటి స్నేహితులు బయటకు రమ్మని డోర్‌ ఎంత కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే డోర్‌ పగులగొట్టి సాహిల్‌ను ఏంఐసీయూకు తరలించారు. వైద్యులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే విద్యార్థి మరణించినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ కరుణాకర్‌రావు, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం మార్చురీకి తరలించారు. జైపూర్‌లోని విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాహిల్‌ ఆత్మహత్యతో వైద్య కళాశాల ప్రాంగణమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, కమిటీ వేసి కారణాలు తెలుసుకుంటామని డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ తెలిపారు. చదువులో చురుగ్గా ఉండేవాడని, స్నేహితులతో కూడా కలివిడిగా ఉండేవాడని, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని అన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పోలీసులతోపాటు తాము కూడా ఇంటర్నల్‌ విచారణ చేయనున్నట్టు చెప్పారు.
రిమ్స్‌లో వసతులపై బీఆర్‌ఎస్పీ నాయకుల ఆవేదన
విద్యార్థి ఆత్మహత్యపై బీఆర్‌ఎస్పీ జిల్లా కన్వీనర్‌ శివకుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థులకు ఆదిలాబాద్‌ మెడికల్‌ కళాశాలలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బార్సు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థి సూసైడ్‌ చేసుకున్న గదితో పాటు హాస్టల్లోని వివిధ విభాగాలను పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తక్షణం కాలేజీలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులు కావాల్సిన కనీస వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట విజ్జగిరి నారాయణ, సాజిదొద్దీన్‌, బుట్టి శివ, వాఘ్మారే ప్రశాంత్‌ ఉన్నారు.
ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ సందర్శన
ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ రిమ్స్‌లో విద్యార్థి మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం తోటి విద్యార్థులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షల షెడ్యూల్‌ ముందు రావడంతో సాహిల్‌ ఆందోళన చెందాడని తోటి విద్యార్థులు చెప్పినట్టు ఎమ్మెల్యే తెలిపారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -