Friday, March 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రపంచానికే వైద్య సేవలు అందించాలి

ప్రపంచానికే వైద్య సేవలు అందించాలి

- Advertisement -

ఆ దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత
ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మందుల ఉత్పత్తి
మానవతా దృక్పథంతో వైద్యం అందించాలి
ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలి
మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవ్వాలి : మెడికవర్‌ ఆస్పత్రి 25వ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో సీఎం

నవతెలంగాణ-మణికొండ
విద్య, వైద్యం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచానికి వైద్య సదుపాయం అందించే కేంద్రంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మందుల ఉత్పత్తి రాష్ట్రంలోనే జరుగుతోందని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోవిడ్‌ టీకాలు ఉత్పత్తి అయితే అందులో మూడు టీకాలు మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేశామని తెలిపారు. ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

వైద్యులు, వైద్య సిబ్బంది ప్రవర్తన ద్వారా కూడా రోగి ఎంతో ఉపశమనం పొందుతాడని అన్నారు. రాష్ట్రంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావాలని, అప్పుడే ఆయా కుటుంబాలు పుష్టిగా ఉంటాయని సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లా నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలో మెడికవర్‌ ఆస్పత్రి 25వ బ్రాంచ్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్‌ రఘువీర్‌ రెడ్డి, మెడికవర్‌ ఆస్పత్రి చైర్మెన్‌ అనిల్‌ కృష్ణతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. మెడికవర్‌ ఆస్పత్రి 2014లో ప్రారంభమై 12 ఏండ్లుగా ఉత్తమ సేవలు అందించడం వల్లనే దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు. మానవత్వంతో కూడిన వైద్య సదుపాయం అందించినప్పుడే రోగులు సంతృప్తి చెందుతారని తెలిపారు.

550 బెడ్లు, 18 ఆపరేషన్‌ థియేటర్లతో ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఫార్మా ఇండస్ట్రీలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందుల ఉత్పత్తిలో మన రాష్ట్రానికి 40 శాతం వాటా ఉందన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ప్రయివేట్‌ వైద్యులు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడాదిలో కనీసం ఒక నెల పనిచేయాలని అన్నారు. అప్పుడే వైద్యులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌ దేశంలో ప్రముఖ హెల్త్‌కేర్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు.

అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆస్పత్రుల స్థాపన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ఇటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఎంతో సహాయపడతాయని తెలిపారు. మెడికవర్‌ ఆస్పత్రుల ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి. అనిల్‌ కృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని ప్రారంభించామని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. ఎ. శరత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 640-స్లైస్‌ సీటీ స్కాన్‌, వేగవంతమైన హార్ట్‌ స్కానింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలతో ఖచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు సమయానికి చికిత్స అందించొచ్చని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.హరికృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి వైద్య సేవల అవసరం పెరుగుతోందని, ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డైరెక్టర్‌ డా. ఎ.ఆర్‌. కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు, సమగ్ర వైద్య విధానాలతో ఈ ఆస్పత్రి రోగులకు వేగవంతమైన, సమర్థవంతమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -