పేరుకే ప్రభుత్వం.. అంతా ప్రయివేటు మయం
ఒకే ప్రాంగణంలో ప్రయివేటు ఇంజినీరింగ్, ప్రభుత్వ వైద్య కళాశాల
మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులు శూన్యం
నిత్యం 40 కిలోమీటర్ల మేర ప్రయాణం
నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైద్య కళాశాలల్లో చాలాచోట్ల కనీస సదుపాయాలు లేక మెడికల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పేరుకు ప్రభుత్వ కళాశాలే అయినా.. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య నడుస్తున్నాయి. కళాశాల ఒక చోట ఉంటే.. ప్రాక్టికల్స్ మరోచోట చేయాల్సి వస్తోంది. అటువంటి వాటిల్లో ఆ కళాశాల ఒకటి.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న భారత్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్‌లోని అద్దె భవనంలో కొనసాగుతన్నది. కళాశాల ఒక చోట.. ప్రాక్టిస్ మరో చోట నడుస్తున్నది. నిత్యం 40 కిలోమీటర్ల మేర వైద్య విద్యార్థులు ప్రయాణం చేయాల్సి వస్తోంది. భారత్ ఇంజినీరింగ్ కళాశాల కొనసాగుతున్న ప్రాంగణంలోనే.. మరో భవనంలో ప్రభుత్వ వైద్య కళాశాల నడుస్తోంది.
ఈ కళాశాల 2024 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం కాలేజీలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 60 మంది అమ్మాయిలు, 40 మంది అబ్బాయిలు. కాలేజీలో లైబ్రరీ, ప్రయోగశాలలు, ఇతర ముఖ్యమైన బోధనా సౌకర్యాలు లేవు. పీజీ కళాశాల, విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడంతో ప్రయివేటు హాస్టళ్లలో ఉంటున్నారు. దాంతో ఉదయం, సాయంత్రం కలిపి ఆరు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తున్నది. ప్రతి విద్యార్థిపై ప్రతినెలా రూ.7,500-8000 వరకు భారం పడుతోంది. కాలేజీలో ప్రయోగశాలలు లేకపోవడంతో ప్రాక్టికల్ సెషన్స్‌లో జాప్యం జరుగుతోంది.
వైద్య విద్యార్థులపై ఆంక్షలు..
భారత్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోనే ప్రభుత్వ వైద్య కళాశాల ఉండగా.. బాలికల కోసం కేటాయించిన ప్రాంగణంలోనూ తగినంత భద్రత లేదని వాపోతున్నారు. వైద్య విద్యార్థుల వాహనాలను అనుమతించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, సంరక్షకుల వాహనాలను కూడా అనుమతించడం లేదని అంటున్నారు.
లైట్లు, కుర్చీలు లేకుండానే గ్రంథాలయం..
విద్యార్థులు చదువుకునేందుకు కళాశాలలో సెంట్రల్ లైబ్రరీని ఇటీవల ఏర్పాటు చేశారు. కానీ అక్కడ కూర్చునేందుకు కుర్చీలు, చదువుకునేందుకు బల్లలు లేవు. ఫ్యాన్లు, లైట్లు కూడా లేవు. విద్యార్థుల నుంచి అభివృద్ధి పేరిట నిధులు వసూలు చేసినా వాటిని వినియోగించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త భవనం ఇంకా పూర్తికాలేదు. కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ నిర్వహించే ఇంటర్ మెడిక్స్ క్రీడా పోటీలకు కావాల్సిన క్రీడా పరికరాలు కూడా లేవు. తమ సమస్యలు పరిష్కరించాలని వైద్య విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య డైరెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. దాంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి : బాయికాడి శంకర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ఇబ్రహీంపట్నంలో అద్దెభవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. క్యాంపస్‌లోనే ప్రభుత్వ హాస్టల్ ఏర్పాటు చేయాలి. ప్రాక్టీకల్స్ కోసం రవాణా వసతిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. లేకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. ఇదే విషయంపై కళాశాల ప్రిన్పిపాల్ త్రివేణిని ‘నవతెలంగాణ’ వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు.
మెడికో బాధలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



