యాప్‌కు 2 లక్షల డౌన్‌లోడ్
రూ.2.5 కోట్ల లావాదేవీలు
3.5 లక్షలకుపైగా టికెట్ల జారీ
త్వరలో ఆర్టీసీ సేవలు కూడా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సేవలను సులభతరంగా అందించేందుకు ఐటీ ఉపయోగపడుతోంది. ప్రతి రంగంలోనూ ఐటీ సేవలను వినియోగించుకోవడమనేది నానాటికి పెరిగిపోతున్నది. సేవల రంగంలో కూడా దీని వాడకం ఎక్కువగా ఉంటోంది. ప్రజల నుంచి కూడా సంప్రదాయబద్ధంగా భౌతికంగా అందించే సేవల కన్నా డిజిటల్ సేవలకే ఆదరణ లభిస్తున్నది. పెరుగుతున్న డిమాండ్, రద్దీని తగ్గించేందుకు, ముందుగానే ప్రణాళికబద్ధంగా కార్యక్రమాల రూపకల్పనకు ఐటీ సేవలను వాడుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణ టికెట్లతో పాటు ఆయా ప్రాంతాల్లో సందర్శనకు టికెట్లను ముందుగానే ఉన్న చోటు నుంచే తీసుకునే వెసులుబాటును కోరుకుంటున్నారు. ఈ అవసరాన్ని గుర్తించి రాష్ట్ర ఐటీశాఖ ఏడాది క్రితం మీటికెట్ యాప్‌ను ఏడాది క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని సేవలకు డిజిటల్ టికెట్లను ప్రారంభంలో అందించిన మీటికెట్ క్రమక్రమంగా తన సేవల పరిధిని విస్తరిస్తున్నది.
మీ టికెట్ యాప్‌కు మొదటి ఏడాదిలోనే బహుళ ఆదరణ లభించింది. ప్రజలకు ఈ యాప్ ద్వారా అనేక రకమైన సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ శాఖ తీసుకొచ్చిన యాప్ మీ టికెట్ ఏడాది పూర్తి చేసుకుంది. తొలి సంవత్సరంలోనే విజయవంతంగా ఈ యాప్ను దాదాపు 2 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా రూ.2.5 కోట్లకుపైగా లావాదేవీలు జరిపారు. దీంతో 3.5 లక్షలకుపైగా టికెట్లను జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో, పార్కులు, దేవాలయాలు, మ్యూజియంలు, కోటలు, బోటింగ్ కేంద్రాలు, నేచర్ క్యాంపులు, కమ్యూనిటీ సౌకర్యాలకు డిజిటల్ టికెటింగ్‌ను ఒకే యాప్ అందిస్తోంది.త్వరలో మీ టికెట్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
నగరాలు, పట్టణాల ప్రయాణికుల కోసం క్యూఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు, అంతర్ నగర బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు.ప్రారంభ దశలో సాధారణ పాస్, మెట్రో డీలక్స్ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ) పాస్, పుష్పక్ ఏసీ పాస్‌లను యాప్‌లో పొందుపరచనున్నారు. ప్రస్తుతం మీ టికెట్ పరిధిలో పరిధిలో సుమారు 123 పార్కులు, 50 బోటింగ్ కేంద్రాలు, 16 దేవాలయాలు, 6 మ్యూజీయంలు, 4 కోటలు/స్మారకాలు, 4 జలపాతాలు, 11 జీహెచ్‌ఎంసీ పార్కులు, 5 నేచర్ క్యాంపులు, ఒక హైదరాబాద్ మెట్రో ఇంటిగ్రేషన్, ఒక ఫంక్షన్ హాల్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక ప్రాంతాలకు ఒకే యాప్ ద్వారా చేరువ చేసే సూపర్ యాప్‌గా మీటికెట్ నిలుస్తోందని వారు తెలిపారు.



