నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ పర్యటనలో తాను తొలిసారి చిరంజీవిని కలవడం ఒక మధురానుభూతి అని ఆయన పేర్కొన్నారు. చిరంజీవిలోని వినయం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆనంద్ మహీంద్రా నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి రాష్ట్ర ‘విజన్ 2047’ ప్రణాళికపై చర్చించారు.
ఈ పర్యటనలోనే అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం లభించిందని ఆయన వివరించారు. ఈ భేటీపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. “చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనను కలవడం ఒక సర్ ప్రైజ్. కానీ, ఆయనలోని వినయం, సహజ సిద్ధమైన జిజ్ఞాస ఆయన్ను మరింత ఆత్మీయుడిగా మార్చాయి. ఆయనను కలవడం ఒక శక్తివంతమైన విషయాన్ని గుర్తుచేసింది. సినిమా, వ్యాపారం, విధాన రూపకల్పన.. ఇలా ఏ రంగంలోనైనా శాశ్వత విజయం సాధించాలంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస, వినయంతో వినగలిగే నైజం పునాదుల వంటివి” అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.



