హూజూర్‌నగర్‌లో నిర్వహణ
150 కంపెనీలలో 10 వేల మందికి ఉపాధి : గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 150 కంపెనీలలో 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు గాను ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు మెగా జాబ్ మేళా గోడపత్రికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళ వారం రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణా డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి అవకాశాల కోసం తెలంగాణా డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ అధికారులు రూపొందించిన మరో గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించనున్న ఈ మెగా జాబ్ మేళాకు సుమారు పది వేలమంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 కంపెనీలు ఇందులో పాల్గొనబోతున్నాయని చెప్పారు.
ఇందులో ఐటీ మ్యాన్యుఫ్యాక్షరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్, తదితర పరిశ్రమలు ఉంటాయన్నారు. నిరుద్యోగులకు వెసులుబాటుగా ఉండేందుకు గాను మెగా జాబ్ మేళా జరుగుతున్న చోట హెల్ప్‌డెస్క్‌తో పాటు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెగా జాబ్ మేళాకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు మౌలిక సదుపాయాలతో పాటు ఇంటర్నెట్ తదితర ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆయన డీఈఈటీ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జీరాక్స్ మిషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మెగా జాబ్ మేళాలో అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువ కులు పాల్గొనేలా ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ తదితర కళాశాలలకు సమాచారం అందిం చాలన్నారు. ప్రత్యక్ష నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపద్యంలో అధికారులు మరోసారి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాను అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.