నేటికీ రుతుస్రావం గురించి బయటకు చెప్పుకోవాలంటే సిగ్గూ, బిడియం. సమాజంలో ఇది ఒక అంటరాని పదం. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అయితే మరింత కట్టుబాట్లు ఉంటాయి. అంతేకాదు సురక్షితమైన రుతుస్రావ ఉత్పత్తులు వారికి అందుబాటులో ఉండవు. ఇదే ఆ బాలికల జీవితాలను పరిమితం చేస్తుంది. అందుకే వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు రుమా, మేఘ భార్గవ అనే సోదరీమణులు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థినులు ప్రతి నెలా కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లరు. ఇది అక్కడ ఓ సాధారణ విషయం. కొన్ని కుటుంబాలైతే వయసుకు వచ్చిన పిల్లలను చదువు మాన్పించి చిన్న వయసులోనే పెండ్లి చేసేస్తున్నారు. అక్క చెల్లెళ్లు అయిన రుమా భార్గవ, మేఘ భార్గవ కొన్నేండ్ల కిందట ఇలాంటి పాఠశాలకే వెళ్లారు. ఈ సమస్య బాలికల జీవితాలను, భవిష్యత్తును ఎంతగా దెబ్బతీస్తుందో గుర్తించారు. ఈ అనుభవమే వారిని ముంబైలో ‘సమర్పణ్’ అనే సంస్థను నిర్మించేలా చేసింది. రుతుస్రావం అంటే సిగ్గు పడడం, నిశ్శబ్దంగా ఉండడం, సురక్షితమైన, శానిటరీ ఉత్పత్తులను పొందలేకపోవడంతో సహా అనేక విషయాలపై ఈ సంస్థ బహిరంగంగా చర్చిస్తుంది. ఇది ఒక ‘సహజ జీవ ప్రక్రియ’ అంటూ యువతుల గౌరవానికి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు అది అడ్డంకిగా మారకుండా కృషి చేస్తోంది.
నష్టాలను గుర్తించి
వైద్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఆ అక్కచెల్లెళ్లకు కేవలం శానిటరీ ఉత్పత్తులను పొందడం మాత్రమే కాదు, దానిపై ఉన్న కళంకం, తప్పుడు సమాచారం, పేలవమైన మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థ గురించి కూడా అర్థం చేసుకున్నారు. పునర్వినియోగపరచదగిన శానిటరీ ప్యాడ్‌ల వైపు మార్పును కోరుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్యాడ్‌ల వల్ల కలిగే నష్టాల గురించి రుమాకు ఒక స్పష్టత ఉంది. ‘అవి చికాకు కలిగిస్తాయి, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వాటి ధర కూడా రూ. 50-80 మధ్య ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్యాడ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తారు. కానీ నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోరు’ అని రూమా అంటుంది.
స్వయంగా ఉపయోగించి
ఒకానొక సమయంలో వారు పనిచేసే ఒక రాష్ట్రంలో ప్రభుత్వ పథకం ప్యాడ్‌ల పరిమాణాన్ని ఎంతగా తగ్గించిందో ఆ అక్క చెల్లెళ్లు గుర్తుచేసుకున్నారు. బాలికలు వాటిని ఉపయోగించడం మానేశారు. ఉపయోగించిన తర్వాత పారవేసే సదుపాయం కూడా లేదు. చాలా పాఠశాలల్లో ఉపయో గించని బర్నింగ్ పిట్‌లను రూమా చూసింది. సమర్పన్ బృందం పరీక్షించి, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేసిన ప్యాడ్‌లు ఎంతో అనుకూ లంగా ఉన్నాయనే నిర్ణయానికి వచ్చారు. కానీ వాటిని బాలికలకు పరిచయం చేసే ముందు రుమాతో పాటు ఆమె బృందం ఆ ఉత్పత్తులను స్వయంగా ఉపయోగిం చారు. అప్పుడే బాలికల ప్రశ్నలకు నిజాయి తీగా సమా ధానం ఇవ్వగలమని వారి నమ్మకం. ప్యాడ్ ఉపయోగించిన తర్వాత ఎలా అనిపిస్తుంది, ఎన్ని గంటలకు మార్చాలి, దాన్ని పరిశుభ్రంగా ఎలా చూసుకోవాలి.. ఇలాంటి వాటిపై పాఠశాలల్లో అవగాహన కల్పించారు.
సందేహాలన్నీ తీరిపోయాయి
అవగాహన తర్వాత తరగతి గదుల లోపల దీనికన్నా మరింత ముఖ్యమైన మార్పు జరిగింది. అప్పటి వరకు డిస్పోజబుల్ ప్యాడ్‌లు, గుడ్డ ముక్కలను మాత్రమే చూసిన బాలికలు, ఇప్పుడు మొదటిసారిగా శాస్త్రీయంగా పరీక్షించబడిన, బహుళస్థాయి పునర్వినియోగ ప్యాడ్‌ను చూస్తున్నారు. కానీ నిమిషాల్లోనే వారి సందేహాలన్నీ తీరిపోయాయి. వీటిపై ఉత్సుకత పెరిగింది. ‘గ్రామీణ బాలికలు చాలా తెలివైనవారు. ఒక్కసారి అడ్డంకి తొలగిపోతే అంగీకారం త్వరగా వస్తుంది’ అంటుంది రూమా. సమర్పన్ వారి రుతు ఆరోగ్య కార్యక్రమం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ, గిరిజన జిల్లాలలో కేంద్రీకృతమై ఉంది. కోటాలో పెరిగిన రుమా ఈ ప్రాంత భౌగోళిక స్థితిని, మానవ అభివృద్ధి సూచికలలో దాని పరిస్థితిని కూడా అర్థం చేసుకుంది. అందుకే ‘మేము నగరాల్లో కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాము’ అని రూమా అంటుంది.
ప్రాంతాలు ఎంపిక చేసుకొని
స్థానిక పోలీసుల మద్దతుతో పన్నా జిల్లాలో మొదటి ప్రధాన ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అత్యంత మారుమూల, దుర్బల ప్రాంతాలను గుర్తించడానికి వారు కమ్యూనిటీ పోలీసింగ్ నమూనాను ఉపయోగించారు. వారు 5,000 మంది బాలికలతో దీన్ని ప్రారంభించారు. నేడు దాదాపు 22,000 మందికి పెరిగారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 5,000 మందిని కవర్ చేయనున్నారు. ఈ బృందం తమ ఉత్పత్తులను పంపిణీ చేయడానికి ముందుగా ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంది. అయితే పునర్వినియోగ ప్యాడ్‌లు ప్రతిచోటా పనిచేయవు. ముఖ్యంగా కామన్ టాయిలెట్‌లు, నీరు అందుబాటులో లేని పట్టణ మురికివాడలలో. అయితే సమర్పన్ పనిచేసే గ్రామీణ ప్రాంతాలలోని చాలా ఇళ్లలో టాయిలెట్లు, నీరు అందుబాటులో ఉన్నాయి.
పురుషుల్లోనూ భాగస్వామ్యం చేయాలి
‘మీరు పురుషులను రుతుస్రావ సంభాషణ నుండి దూరంగా ఉంచలేరు. పురుషులు ఉన్న కుటుంబాలు, పాఠశాలల్లో అమ్మాయిలు పెరుగుతారు. ప్రభావవంతమైన పాత్రలు పోషిస్తారు. కనుక రుతుస్రావాన్ని రహస్యంగా, అవమానకరంగా పరిగణించి నట్లయితే అమ్మాయిలు ఎప్పటికీ తమ అసౌకర్యం గురించి మాట్లాడలేరు, సెలవు అడగలేరు. పైగా ఇది జీవసంబంధమైన ప్రక్రియగా పరిగణించాల్సి న ఉద్దేశాన్ని ఇది ఓడిస్తుంది’ అని ఆమె అంటుంది. వీరి పని ప్రారంభంలో కొంత ప్రతిఘటన ఎదుర్కొన్నారు. కానీ పురుష సిబ్బందికి శాస్త్రీయ, సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కల్పించిన తర్వాతే వారు స్వచ్ఛందంగా చేరడానికి మొగ్గు చూపుతారు. పాఠశాలలో ఈ అవగాహన కార్యక్రమాల వల్ల బాలికలు తమ ఇళ్లలో, సమాజం లో ధైర్యంగా జీవించగలరు.
మంచి మార్పు
ఈ బృందం పని చేయడం ప్రారంభించిన తర్వాత పాఠశాలకు హాజరయ్యే అమ్మాయిల సంఖ్య బాగా పెరిగింది. మంచి మార్పు వచ్చింది. ప్రస్తుతం వాళ్లు విశ్వవిద్యాల యంతో పరిశోధనా భాగస్వామ్యం పొందారు. నవంబర్ 2025లో తాము చేస్తున్న పనికి గాను రుమా, మేఘ ‘ఫోర్బ్స్ ఇండియా వి సర్వ్ ఇండియా అవార్డు’ను అందుకున్నారు. ఈ అవార్డు సమర్పన్ తన విస్తృత శ్రేణి రుతు పరిశుభ్రత, గ్రామీణ, గిరిజన భారతదేశంలో పాఠశాల హాజరు, పర్యావరణ స్థిరత్వంపై ప్రభావాన్ని చూపుతోంది.
దీర్ఘకాలిక పరివర్తనకై
ప్రతి పాఠశాలలో రుమా బృందం పనిచేసినప్పుడు ఉత్పత్తుల పంపిణీకి ముందు అవగాహన ఉండేలా చూసుకున్నారు. ‘ఎందుకంటే మా లక్ష్యం దీర్ఘకాలిక పరివర్తన, శీఘ్ర పరిష్కారం కాదు’ అని ఆమె చెప్పింది. దీనికోసం వారు స్వయంగా తయారు చేసిన హిందీ భాషా బుక్‌లెట్‌ను ఉపయోగిస్తారు. ఇది రుతుస్రావాన్ని సరళమైన శాస్త్రీయ పరంగా వివరిస్తుంది, అపోహలను తొలగిస్తుంది, నిషిద్ధాలను పరిష్కరిస్తుంది. వారి సెషన్లలో ప్రదర్శనలు, ప్రశ్నాపత్రాలు ఉంటాయి. దశలవారీ అవగాహన ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయులతో, ముఖ్యంగా పురుష ఉపాధ్యాయులతో కలిసి పనిచేయవలసిన అవసరాన్ని రుమా నొక్కి చెబుతోంది.
రుతుస్రావమంటే సహజ జీవ ప్రక్రియ
- Advertisement -
- Advertisement -



