‘గోట్ టూర్’ షెడ్యూల్
న్యూఢిల్లీ: 2022 ఫిఫా ప్రపంచకప్ ఛాంపియన్ అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ భారత టూర్ షెడ్యూల్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ నామకరణంతో జరిగే ఈ కార్యక్రమంలో మెస్సీ… హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీలలో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనున్నారు. శనివారం తెల్లవారుఝామున మెస్సీతోపాటు ఇంటర్ మియామీ ఆటగాళ్లు రోడ్రిగో-డి-పాల్, లూయిస్ సువారేజ్ కోల్‌కతా చేరుకోనున్నారు. కళాకారుడు మోంటి పాల్ తయారు చేసిన ‘మాన్యుమెంటో-డి-మెస్సీ’ పేరుతో తయారు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ ప్రారంభిస్తారు. అనంతరం యువ భారతి క్రిరంగన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గోనున్నారు. అనంతరం కొద్దిమంది చిన్నారులతో మెస్సీ కలవనున్నట్లు ‘గోట్ టూర్’ ముఖ్య సలహాదారు షాజీ ప్రభాకరన్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.05కు ముగుస్తుందని బిద్ధానగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అనీశ్ సర్కార్ తెలిపారు. శనివారం సాయంత్రం 7గంటలకు హైదరాబాద్ చేరుకొని ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ‘గోట్ కప్’ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. 14న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో, 15న న్యూఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడనున్నారు. తిరుగు ప్రయాణానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీతో మెస్సీ బృందం కలవనుంది.



