Sunday, December 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమెరిసిన మెస్సీ… సీఎం గోల్‌

మెరిసిన మెస్సీ… సీఎం గోల్‌

- Advertisement -

అభిమానుల ఘనస్వాగతం
హైదరాబాద్‌లో సాకర్‌ స్టార్‌ సందడి
ఉప్పల్‌లో ఉత్సాహభరితంగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌
గోట్‌ టూర్‌లో రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ జోష్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌, అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ రాకతో హైదరాబాద్‌ ఊగిపోయింది. ఇన్నేండ్లు టెలివిజన్‌ తెరపై అభిమాన ఆటగాడి ఫుట్‌బాల్‌ నైపుణ్యం చూసి మురిసిన హైదరాబాదీలు శనివారం ఉప్పల్‌ స్టేడియంలో సాకర్‌ స్టార్‌ గోల్‌ మేనియాలో పడిపోయారు. మెస్సి రాకతోఉప్పల్‌ స్టేడియం భావోద్వేగ ంతో ఉప్పొంగి పోయింది. అర్జెంటీనా యోధుడికి అపూర్వ స్వాగతం పలికింది. క్రికెటర్ల సిక్సర్లు, ఫోర్లతో హౌరెత్తే ఉప్పల్‌ స్టేడియం శనివారం అందుకు భిన్నంగా గోల్స్‌, పాస్‌లు, డ్రిబ్లింగ్‌ స్కిల్స్‌తో ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడి యం ఘటనతో అప్రమత్తమైన హైదరాబాద్‌ పోలీసులు, నిర్వాహకులు ఉప్పల్‌ స్టేడియం ఈవెంట్‌ను విజయవ ంతంగా నిర్వహించారు. గోట్‌ టూర్‌ హైదరాబాద్‌లో లియోనల్‌ మెస్సీతో పాటు ఇంటర్‌ మియామి సహచర ఆటగాళ్లు లూయిస్‌ స్వారేజ్‌, డిపాల్‌లు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ ఫుట్‌బాల్‌ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెస్సీపై రేవంత్‌ గెలుపు
ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన గోట్‌ కప్‌ పోటీలో లియోనల్‌ మెస్సి జట్టుపై సీఎం రేవంత్‌రెడ్డి జట్టు ఘన విజయం సాధించింది. మెస్సీ రాకముందే సింగరేణి ఆర్‌ఆర్‌, అపర్ణ ఆల్‌స్టార్స్‌ జట్ల మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆరంభమైంది. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్‌ జట్టు 3-1తో విజయం సాధించింది. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన మెస్సీ.. ఇరుజట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసి, సీఎం రేవంత్‌తో కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ అనంతరం ఏర్పాటు చేసిన పెనాల్టీ షౌటౌట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అలరించాడు. గోల్‌కీపర్‌ ఎడమ వైపునకు కిక్‌ చేయాలని సూచించినా… రేవంత్‌రెడ్డి కుడి కాలు కిక్‌తో కుడి వైపు కార్నర్‌కు బంతిని పంపించి గోల్‌ కొట్టాడు. రేవంత్‌ టెక్నిక్‌తో మెస్సీతో పాటు స్వారేజ్‌, డిపాల్‌ను ఆకట్టుకున్నారు. ఫుట్‌బాల్‌ లో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులతో ఉప్పల్‌ స్టేడియంలో నాలుగు కోచింగ్‌ క్లీనిక్‌లు ఏర్పాటు చేశారు.

మెస్సీ, రేవంత్‌రెడ్డి స్టేడియంలో పరేడ్‌ చేస్తూ.. మధ్యలో చిన్నా రులతో కోచింగ్‌ క్లీనిక్‌ల్లో సాకర్‌ స్కిల్స్‌ ప్రదర్శించారు. చిన్నారులతో కలిసి పాస్‌లు, డ్రిబ్లింగ్‌తో సందడి చేశారు. ఆఖర్లో మెస్సీ, రేవంత్‌, స్వారేజ్‌, డిపాల్‌లు సైతం ట్రయాం గిల్‌ పొజిషన్‌లో పాస్‌లు ఆడుతూ అభిమానులను అలరించారు. ఉప్పల్‌ స్టేడియంలో గోట్‌ టూర్‌ ముగింపు సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్‌ మైదానం లోకి వచ్చారు. మెస్సీ, రేవంత్‌తో కలిసి వేదికను పంచుకున్న రాహుల్‌గాంధీ.. సాకర్‌ స్టార్‌ తో సరదాగా సంభాషిస్తూ కనిపించారు. అనంతరం సింగరేణి ఆర్‌ఆర్‌ జట్టుకు గోట్‌కప్‌ను మెస్సీ ప్రదానం చేయగా, రన్నరప్‌ ట్రోఫీకి అపర్ణ ఆల్‌స్టార్స్‌కు సీఎం బహూకరించారు.

తెలంగాణ రైజింగ్‌లో భాగం కండి : సీఎం
గోట్‌ టూర్‌ ముగింపు వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి సింగిల్‌ లైన్‌ సందేశం ఇచ్చారు. ‘తెలంగాణ ఈజ్‌ రైజింగ్‌. కమ్‌ జాయిన్‌ ది రైజ్‌’ అంటూ మెస్సీకి చెప్పారు. లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేటర్‌ సహాయంతో మాట్లాడిన లియోనల్‌ మెస్సీ.. ‘హైదరాబాద్‌కు రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అభిమానుల ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు’ అని అన్నాడు. అర్జెంటీనా మెమెంటో జెర్సీని నిర్వాహకులకు మెస్సీ బహూకరించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్లు మెస్సీతో పాటు స్వారేజ్‌, డిపాల్‌కు జ్ఞాపికలు అందజేశారు. రాత్రి 8.57 గంటలకు ఉప్పల్‌ స్టేడియం నుంచి మెస్సీ బృందం బయటకు వచ్చింది. ఆ తర్వాత నేరుగా తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఈరోజు రాత్రి ఇక్కడే బస చేయనున్న మెస్సీ.. రేపు ఉదయం ముంబయికి బయల్దేరి వెళ్తారు. అక్కడ క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో, వాంఖడె స్టేడియాల్లో జరుగనున్న గోట్‌ టూర్‌లో పాల్గొంటారు. అంతకుముందు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఉప్పల్‌ స్టేడియంకు క్యూ కట్టారు. రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె కూడా మెస్సీ ఫుట్‌బాల్‌ క్రీడను వీక్షించారు.

పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. కోల్‌కత్తా ఘటనతో తాము మరింత అప్రమత్తం అయ్యామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ చెప్పారు. ఎక్కడికక్కడ డ్రోన్‌ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను, జనసమ్మర్థాన్ని నియంత్రిస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మ్యాచ్‌ ముగిశాక సీఎం రేవంత్‌రెడ్డి తన మనవడిని గ్రౌండ్‌లోకి తెచ్చి, మెస్సీకి పరిచయం చేశారు. సరదాగా మనవడితో ఫుట్‌బాల్‌ ఆడారు. కోల్‌కతా నుంచి శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగిన మెస్సీ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెస్సీని కలిసేందుకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం అనంతరం ఫొటోసెషన్‌ సందర్భంగా మెస్సిని మీట్‌ అయ్యే వారికి క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన లేజర్‌ షో ఆకట్టుకుంది. రాహుల్‌ సిప్లిగంజ్‌, మంగ్లీ మ్యూజికల్‌ ఈవెంట్‌ అభిమానులను అలరించింది. టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ తన కొడుకు అయాన్‌, కుమార్తె అర్హతో స్డేడియంలో సందడి చేశారు. వెయిట్‌ లిఫ్టర్‌ ప్రగతి తదితరులు మెస్సిని చూసేందుకు పోటీపడ్డారు.

మెస్సీకి బ్రహ్మరథం
కోల్‌కతా నుంచి మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న లియోనల్‌ మెస్సీకి ఇక్కడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు, ఈవెంట్‌ నిర్వాహకులు మెస్సీకి వెల్‌కమ్‌ చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మెస్సీ సహా లూయిస్‌ స్వారేజ్‌, డిపాల్‌లు ఫలక్‌నుమాలోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మెస్సీ రాకతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకు సాకర్‌ స్టార్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సాయంత్రం విశ్రాంతి తీసుకున్న మెస్సీ.. రాత్రి 8.04 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో అడుగుపెట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -