కార్మికోద్యమానికి మార్గ నిర్దేశం
కార్మికోద్యమంలో మనుస్మృతి జొప్పించేయత్నం
ఈనెల 7 నుంచి మెదక్‌లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు : సంగారెడ్డిలో 2కే రన్ ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు సీఐటీయూ రాష్ట్ర మహాసభలు మెతుకు సీమలో నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌ను చుక్క రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తూ కార్మికుల హక్కులను తొలగిస్తున్నాయని విమర్శించారు. శ్రమచేసే వాడికి విలువ లేని పరిస్థితిని సమాజంలో సృష్టిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. యజమాని ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తూ ఆయన చెప్పిందే వేదవాక్కు అనేలా తేనే పూసిన కత్తిలాగా ఇవాళ మనుస్మృతిని కార్మిక చట్టాల్లో చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికాగో నగరంలో కార్మికులు పోరాడితే ఐఎల్‌ఓ చేసిన తీర్మానం ప్రకారం 8 గంటల పని విధానం వచ్చిందని గుర్తుచేశారు.
‘హైర్ అండ్ ఫైర్’ అనేది భారతదేశ విధానం కాదని, ఇది అమెరికాలో ఉన్నదని తెలిపారు. ఇలాంటి పెట్టుబడిదారీ దేశాల చట్టాలను మోడీ మన దేశంలోనూ చొప్పిస్తూ కార్మికుల మీద యుద్ధం ప్రకటిస్తున్నారని విమర్శించారు. కార్మికులు తమ హక్కుల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని, హక్కులను మాత్రం వదులుకోమని స్పష్టంచేశారు. చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో భవిష్యత్తులో ఐక్య పోరాటాలు నిర్మించడానికి మెతుకు సీమ వేదిక కాబోతుందని తెలిపారు. కాబట్టి, ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి ప్రతి కార్మికుడు, సీఐటీయూ కార్యకర్త బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.మల్లేశం, జి.సాయిలు, ఉపాధ్యక్షులు ఏ.మాణిక్యం, బాగారెడ్డి, నాయకులు యాదగిరి, ఎం.నర్సింలు, ఎ.నాగభూషణం, ప్రసన్న, సురేష్, దత్తు, వివిధ కంపెనీల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాల నిర్మాణాలకు మెతుకుసీమ వేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



