Friday, March 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమంటల్లో మధ్యప్రాచ్యం

మంటల్లో మధ్యప్రాచ్యం

- Advertisement -

క్షిపణులు ,డ్రోన్లతో ఇరుపక్షాల విధ్వంసం
దోహాలో పేలుళ్లు
భీతిల్లిన జనం
అజర్‌బైజాన్‌ ఎయిర్‌పోర్టును తాకిన డ్రోన్‌
కువైట్‌ చమురు నౌకపై ఇరాన్‌ దాడి.. మునిగిన నౌక
ఇరాన్‌లో 1,200 మందికి పైగా మృతి
సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న టెహ్రాన్‌ ప్రజలు

మధ్యప్రాచ్యంలో చెలరేగిన యుద్ధం గురువారం ఆరో రోజుకు చేరింది. దాడులు, ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో మునుపెన్నడూ లేనంతగా సంక్షోభం నెలకొంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడుతుండగా లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయిల్‌ ముమ్మరంగా దాడులు చేస్తోంది. అమెరికా జలాంతర్గామి జరిపిన దాడిలో ఇరాన్‌ యుద్ధ నౌక మునిగిపోవడం, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించడంతో సముద్ర జలాలలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ సేనల దాడిలో ఇరాన్‌లో ఇప్పటి వరకూ 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయిల్‌ దాడులతో లెబనాన్‌లో కూడా పదుల సంఖ్యలో ప్రజలు చని పోయారు. బాంబు దాడులతో భీతిల్లిపోతున్న ప్రజానీకం వేల సంఖ్యలో టెహ్రాన్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

నవ తెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
మధ్యప్రాచ్యంలో యుద్ధం మంటలు చల్లారటం లేదు. ఆరో రోజైన గురువారం కూడా భీకర పోరు కొనసాగింది. పర్షియన్‌ గల్ఫ్‌లో అమెరికాకు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) దాడి చేయడంలో అది అగ్నికీలలలో చిక్కుకుంది. ఖతార్‌ రాజధాని దోహాలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపిం చాయి. ఇరాన్‌ డ్రోన్లు అజర్‌బైజాన్‌ అంతర్జాతీయ విమానాన్ని తాకడంతో కొంతమేర నష్టం జరిగింది. ఇద్దరు గాయపడ్డారు. ఇరాన్‌ పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగిస్తుండడంతో సెంట్రల్‌ ఇజ్రాయిల్‌, జెరుసలేం, వెస్ట్‌ బ్యాంక్‌లోని ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేశారు.

కువైట్‌ ఓడరేవు సమీపంలోని జలాలలో ఉన్న చమురు నౌకలో పెద్ద పేలుడు జరిగింది. ఈ ఘటనలో నౌకలోని చమురు సముద్రం పాలైంది. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ హమేదాన్‌ రాష్ట్రంలో ఇజ్రాయిల్‌కు చెందిన హెర్మెస్‌ డ్రోన్‌ను కూల్చివేసిందని తస్నిమ్‌ వార్తా సంస్థ తెలిపింది. అమెరి కన్లు ఎక్కడ ఉన్నా వారితో పోరాడాలని నిర్ణయించామని ఐఆర్‌ జీసీ కమాండర్‌ జనరల్‌ హెదరీ చెప్పారు. యుద్ధం ఎంతకాలం కొనసాగినా తాము వెనక్కి తగ్గబోమని అన్నారు. మరోవైపు ఇరాన్‌ పైన, బిరుట్‌లోని హెజ్బొల్లా లక్ష్యాల పైన ఇజ్రాయిల్‌ దాడులు జరిపింది. కాగా అమెరికా, ఇజ్రాయిల్‌, యూరప్‌ నౌకలకు మాత్రమే హర్మూజ్‌ జలసంధిని మూసివేశామని ఇరాన్‌ వివరణ ఇచ్చింది.

ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన అమెరికా
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు జరుగుతున్న తరుణంలో కాలిఫోర్నియా తీరంలో అమెరికా మంగళవారం రాత్రి ఓ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే మరింత శక్తివంతమైన అణు వార్‌హెడ్లను మోసుకుపోగల సామర్ధ్యం ఈ క్షిపణికి ఉంది. శాంటా బార్బరా సమీపంలోని వండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించి పరీక్షించారు. జీటీ 254గా గుర్తించిన ఈ రాకెట్‌లో ఆయుధాలేవీ లేవు. ఇది పసిఫిక్‌ సముద్రంలో వేలాది మైళ్ల దూరం ప్రయాణించి పశ్చిమ-మధ్య పసిఫిక్‌లోని మార్షల్‌ దీవులలో లక్ష్యాన్ని తాకింది. క్షిపణి వ్యవస్థ పనితీరు, సామర్ధ్యం, కచ్చితత్వం, సంసిద్ధతను అంచనా వేసేందుకే ఈ ప్రయోగం జరిపామని అమెరికా సైన్యం చెప్పింది.

ఇరాన్‌పై సైనిక చర్యలను ఉధృతం చేస్తామని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ‘ఓ పెద్ద ఆయుధం రాబోతోంది’ అని గతంలోనే సంకేతం ఇచ్చారు. కాగా ఇది సాధారణంగా జరిపే ప్రయోగమేనని, ఏండ్ల క్రితమే దీన్ని నిర్ణయించామని వైమానిక దళ గ్లోబల్‌ స్ట్రయిక్‌ కమాండ్‌ తెలిపింది. అమెరికా అణు వ్యవస్థలో ఈ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘మినుటెమన్‌-3’ కీలకమైనది. దీనిని అణు త్రయ వ్యవస్థగా పిలుస్తారు. అంటే ఈ వ్యవస్థలో భూమి నుంచి ప్రయోగించే క్షిపణులు, జలాంతర్గాముల నుంచి ప్రయో గించే ఆయుధాలు, విమానాల నుంచి జారవిడిచే అణు బాంబులు ఉంటాయి. ఈ క్షిపణులను అమెరికా పశ్చిమ ప్రాంతంలోని భూగర్భ గోతులలో నిల్వ ఉంచారు. దేశంపై అణ్వస్త్ర దాడి జరిగితే వీటిని ఉపయోగిస్తారు. ఈ క్షిపణిని గత నవంబరులో కూడా పరీక్షించారు. గంటకు పదిహేను వేల మైళ్ల వేగంతో ఆరు వేల మైళ్ల దూరం ప్రయాణించే సామర్ధ్యం దీనికి ఉంది. ప్రపంచంలోని ఏ లక్ష్యంపైన అయినా నిమిషాల వ్యవధిలో దాడి చేస్తుంది.

అధికార వ్యవస్థ కూల్చివేతే అమెరికా లక్ష్యం
యుద్ధం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలన్నదే తన ఉద్దేశమని ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అయితే ఆయన అసలు ఉద్దేశం వేరేగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టెహ్రాన్‌లో అధికార వ్యవస్థను కూల్చడమే ట్రంప్‌ లక్ష్యమని వారు తెలిపారు. అయితే భూతల దాడులు జరపకుండా ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమేమీ కాకపోయినప్పటికీ కష్టమేనని వారు స్పష్టం చేశారు. ఇరాన్‌లో నాయకత్వ మార్పును సాధించేందుకు కొంత మూల్యం చెల్లించుకోవడానికి అమెరికా ఇష్టపడడంలేదని, ఒకవేళ వైమానిక దాడుల ద్వారా అనుకున్నది సాధించలేకపోతే వేరే లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇరాన్‌లోని అధికార వ్యవస్థను వైమానిక దాడులతోనే కూల్చివేయలేమన్నారు. ‘మీరు భవనాలకు నష్టం కలిగించవచ్చు. ప్రభుత్వానికి నష్టం కలిగించవచ్చు.

అయితే వైమానిక దాడుల ద్వారా అధికార మార్పిడి జరిగిన ఉదంతాలు ప్రపంచంలో ఎక్కడా లేవు’ అని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రసిడెంట్‌ మాథ్యూ దస్‌ చెప్పారు. లిబియాలో 2011 లో నాటో నేతృత్వంలో వైమానిక దాడులు జరిగాయి. గడాఫీని పదవీచ్యుతుడిని చేశాయి. అయితే లిబియా రెబల్స్‌ భూతల దాడులు జరపడం వల్లనే ప్రభుత్వం పతనమై అధికార మార్పిడి జరిగింది. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిందిగా ట్రంప్‌, అమెరికా అధికారులు ఇరాన్‌ ప్రజలను కోరుతున్నప్పటికీ వారు ఆశించిన స్పందన లభించడం లేదు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ వ్యవస్థతో పోరాడే సత్తా అక్కడ ఎవరికీ లేదు. యుద్ధంలో పదాతి దళాలను దింపడానికి అమెరికా సుముఖంగానే ఉన్నప్పటికీ దానివల్ల భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ట్రంప్‌ అప్రదిష్టను మూటకట్టుకున్నారు. కేవలం నాలుగో వంతు అమెరికన్లు మాత్రమే యుద్ధాన్ని సమర్ధిస్తున్నారని ఇటీవల రాయిటర్స్‌ జరిపిన సర్వే తేల్చింది.

లంక జలాల వైపు ఇరాన్‌ నౌక
ఇరాన్‌కు చెందిన మరో యుద్ధ నౌక గురువారం శ్రీలంక ప్రాదేశిక జలాల వైపు కదులు తోంది. ఇందులో వంద మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ నౌకపై కూడా అమెరికా దాడి చేయవచ్చునన్న అనుమానంతో ఇరాన్‌ ప్రభుత్వం శ్రీలంక సాయం కోరింది. ఇరాన్‌ నౌక భద్రతపై చర్చించేందుకు శ్రీలంక అధ్య క్షుడు అనుర కుమార దిశనాయకే ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. బుధవారం అమెరికా జలాంతర్గామి జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 87 మంది ఇరాన్‌ నావికుల మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాణాలతో బయటపడిన 32 మందికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చికిత్స కొనసాగుతోంది.

ఎలాంటి హెచ్చరిక లేకుండానే…
ఇరాన్‌ యుద్ధ నౌక ‘ఐఆర్‌ఐఎస్‌ దేనా’పై అమెరికా దాడిని ‘సముద్రంలో జరిగిన దారుణం, క్రూరత్వం’గా ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయేద్‌ అబ్బాస్‌ అరాగ్చీ అభివర్ణించారు. భారత్‌లో జరిగిన వైమానిక దళ విన్యాసాలలో తమ నౌక పాల్గొన్నదని, అందులో 130 మంది నావికులు ఉన్నారని ఆయన తెలిపారు. సముద్ర జలాలలో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేసే సంప్రదాయానికి తెర తీసినందుకు అమెరికా తీవ్రంగా విచారించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌ తీరానికి చాలా దూరంలో ఉన్న నౌకపై ఎలాంటి హెచ్చరిక లేకుండా అమెరికా దాడి చేసిందని ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకను అమెరికా దళాలు టార్పెడోను (నీటి అడుగున ప్రయోగించే విధ్వంసకర ఆయుధం) ఉపయోగించి పేల్చివేయడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 18-25 తేదీల మధ్య బంగాళాఖాతంలోని మిలన్‌ ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో ఈ నౌక పాల్గొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి తిరిగి స్వదేశానికి వస్తుండగా అంతర్జాతీయ జలాలలో దానిపై అమెరికా దాడి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -