- సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌కి వాంగ్ యి ఫోన్
నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రాచ్య యుద్ధం తీవ్రరూపం దాల్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి హెచ్చరించారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌కి గురువారం వాంగ్ యి ఫోన్‌చేసి పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడారు. మధ్యప్రాచ్య యుద్ధం తీవ్రమైతే ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వాంగ్ అయి అన్నారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
కాగా, ఇరాన్‌లో నెల రోజులకు పైగా కొనసాగుతున్న సంఘర్షణ వల్ల అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ ఘర్షణలు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల భద్రత పైనా, స్థిరత్వపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. కాల్పుల విరమణ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడంపైనే దృష్టి పెట్టడమే తక్షణ కర్తవ్యం అని వాంగ్ ఫర్హాన్‌కి నొక్కి చెప్పినట్లు చైనా విదేశాంగ ప్రకటన పేర్కొంది. అదే సమయంలో ఉద్రిక్తతలు కొనసాగితే.. కీలకమైన ప్రపంచ ఇంధన కారిడార్ అయిన హోర్ముజ్ జలసంధిలో అస్థిరత కొనసాగడానికి దారితీయవచ్చునని వాంగ్ యి హెచ్చరించారు.
అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్యలు ఘర్షణను పెంచకుండా ఉండాలి. అనధికారిక సైనిక చర్యలను చట్టబద్ధం చేయకూడదు. లేకపోతే పరిణామలు వినాశకరంగా ఉంటాయి. దీనివల్ల చిన్న, మధ్యతరహా దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి అని వాంగ్ పేర్కొన్నట్లు ప్రకటన పేర్కొంది. ప్రాంతీయ శాంతిని పునరుద్ధరించడానికి సౌదీ అరేబియాతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని వాంగ్ తెలిపారు. గల్ఫ్ దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడటం, పౌరులు – సైనికేతర లక్ష్యాలపై దాడులను నిలిపివేయడం, సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం వంటి అంశాలతో చైనా- పాకిస్తాన్‌లు చొరవతో ఐదు సూత్రాలను ప్రతిపాదించినట్లు కూడా వాంగ్ ఫర్హాన్‌తో ప్రస్తావించినట్లు చైనా విదేశాంగ ప్రకటన పేర్కొంది.
వాంగ్ యి మాటలకు ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పందించారు. ఈ యుద్ధం ప్రాంతం – ప్రపంచంపై తీవ్రమైన ప్రభావాన్న చూపుతోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించి, సంఘర్షణను ముగింపు పలకడానికి ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై చైనాతో సంప్రదింపులు, సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడానికి సౌదీ రాజధాని రియాద్ ఆశిస్తోందని ఆయన అన్నారు.



